దైవంలో ఉన్నాం అని తెలియక, దైవానికి దూరం పాటిస్తారు చాలా మంది... ఈ దూరం తగ్గించుకోవడమే భక్తి,
భక్తి ఎక్కువవుతున్న కొలదీ అది అవ్యాజమైన ప్రేమగా మారుతుంది. ప్రేమే నిజమైన దైవం.
మన చుట్టూ ప్రాణ వాయువులా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఆ ప్రాణ వాయువు కోసం, హిమాలయాలకు వెళుతున్నానని ఎవరైనా అంటే అర్ధం లేదు.
రాయిలో రాయిగా, మొక్కలో మొక్కగా, జంతువులలో జంతువుగా, మనుషులలో మనిషిగా ప్రకృతి వ్యాపించి ఉంది. ఆ ప్రకృతి ఈశ్వరుడి ఆధీనంలో ఉంది.
ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని, తల్లి ఊరంతా వెదికిన చందం- దైవం కోసం 'ఎక్కడున్నావయ్యా'' అని గొంతు చించుకోవడం.
భగవంతుడు నీకు దూరంగా ఉన్నాడనే ఆజ్ఞానం పోగొట్టుకోవడమే అసలు సిసలైన సాధన.
నీ శ్వాస కంటే దగ్గరగా, ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు ఈశ్వ రుడని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. మరి ఈ వెదుకులాట ఎందుకు? సత్యం తెలిసిన తరవాతా భగవంతుడిలో మనం ఉన్నాం అనే భానవ ఎందుకు కలగడం లేదు... అదే తెలుసుకోవాలి.
మన దూరంగా ఎక్కడో భగనంతుడు ఉన్నాడనే దాని మీదే ఉంది. తెలిసో తెలియకో దైవాన్ని దూరంగా ఉంచేసి.. స్తుతులు, షోడశోపచారాలతో ఆయన్ని పిలుస్తూ ఉన్నాం.
సాధనే తప్పుడు మార్గంలో వెళుతోంది. మొదట భగవంతుడి నివాసం చక్కగా తెలుసుకోవాలి. దాన్ని ధృడంగా నమ్మాలి. పెద్దలు, శాస్త్రాలు చెప్పిన విషయం తప్ప కాదని భావించి ఈశ్వరుణ్ని గ్రహించాలి.
దేవుడెక్కడున్నాడు ?! అనే కంటే, ఆయన ఎక్కడ లేడు అనుకుని సాధన మొదలు పెడితే తొందరగా ప్రేమమయుడి దర్శనం అవుతుంది. సర్వజీవుల అంతర్యామి హృదయాల్లో భగవంతుడి నివాసం తెలుసుకున్న భక్తుడికి ఆయన ఏనాడూ, దూరంగా లేదు. ఈ విషయాన్ని భగవద్గీత ఏనాడో ధ్రువీకరించింది.
అందరిలో భగవంతుణ్ని కనుగొన్న వ్యక్తి తనతో పాటు అందరినీ దైవస్వరూపులుగా చూస్తాడు. ఎక్కువ తక్కువలుగా ఎవరినీ చూడడు. చూడలేదు.
హృదయమే భగవంతుడి నివాసం అని తెలిసిన మరుక్షణమే సాధకుడి జీవన విధానం మారిపోతుంది. భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు మూడూ అతడి సన్నిధిలో ఆలరారుతుంటాయి. ప్రతి రాయి అతడికి శివలింగంగా, ప్రతి పురుగు పాకే దైవంగా, ప్రతి పిట్ట ఎగిరే దైవంగా, ప్రతి మనిషి నడిచే దైవంగా భావిస్తాడు. ఇది కదా ఈశ్వరుడు. మనిషి నుంచి కోరుకున్న అత్యుత్తమ స్థితి.
దైవం సర్వవ్యాపి అనే భావనే సులువుగా మనలను ధ్యానస్థితిలోకి తీసుకుపోతుంది. ఆ ఆనందం వర్ణించనలవి కాదు. అక్కడికి వెళ్ళినవాడు. ఈ మాయా ప్రపంచంలోకి తిరిగిరావడానికి ఇష్టపడరు. దైవం గురించి యదార్ధ జ్ఞానం మన దగ్గరుండాలి. అప్పుడే సత్యాన్ని తొందరగా చేరుకోగలం. స్నేహితుడి ఇంటి చిరునామా సరిగ్గా మన చేతిలో ఉంటే సులభంగా అతడి వద్దకు చేరుకోగలం. సమయం వృథా కాదు. శ్రమ ఉండదు. అన్వేషణ ప్రారంభించే ముందే గమ్యం ఏమిటో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి.
- ఆనందసాయి స్వామి