నాచేయి విడు అమ్మా!
అడుగులేయటం నేర్చుకోనీ
గతుకుల నేలపై పాకనీ
మోకాలి చిప్పలు బద్దలై
మొద్దు బారనీ!
రక్తపు చారలు చూసి
బాధపడకు అమ్మా!
భావికి నన్ను సిద్ధంకానీ!
గాలిపటం ఎగరేసే నన్ను ఆపకు!
ఉన్నత శిఖరాలకు సిద్ధం కానీ!
మెట్లు ఎక్కే నన్ను వారించకు
పడుతూ లేస్తూ వైకుంఠపాళి
ఎక్కడం నేర్వనీ!
మొండిగా బండగా మారనీ!
చేయూతనిచ్చి మార్చకు
పారజైట్ లాగా!
కన్నీటితో నాకనులు
చెరువులు కావాలి!
ప్రపంచపు అడవిలో
ఒంటిగా తిరగనీ
వేటగాడి బారినుండి
తప్పుకునే
చిక్కులముడి విప్పుకునే
ఒంటిగా ఈలోకంలో బతికే
అవకాశం ఇవ్వమ్మా!
నా బుల్లి వేళ్ళు పట్టుకొని
నడవకు!
నన్ను నన్నుగా
బతకడం నేర్చుకోనీ అమ్మా!
- అచ్యుతుని రాజ్యశ్రీ
(హైదరాబాద్)
Advertisement