మా మంచి మామయ్య...ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం

Advertisement
Update:2023-09-10 18:37 IST

సీ. జీవిఎస్, సాహిత్య జీనిఎస్, నిత్యజిజ్ఞాసు వధ్యాపనాభ్యాసశీలి

వీర రసము తోడ విజయంబు గైకొని

పిన్న వయసులోనె పేరు గాంచె

తనదైన శైలిలో ఎనలేని కృషిసల్పి

తెలుగు బాసకు క్రొత్త వెలుగు తెచ్చె

విశ్లేషణ, విమర్శ, విద్వత్తు లందున

దివ్యదీపము వలె దిశలు చూపె

తే.గీ. గర్వ మన్నది యెరుగడు, కరుణ తప్ప

మాట మంచి తనంబును, మహితబుద్ధి

జీవితం బంతయును సాయి సేవ చేసె

అట్టి మహనీయ మూర్తికి అంజలిడుదు

కీర్తి శేషులు, పూర్వ తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, ఆచార్య గూడ వేంకట సుబ్రహ్మణ్యం గారి జయంతి 10 సెప్టెంబర్ 1935

తెలుగు పూలతోటలో మొగ్గ తొడిగి తన సారస్వత పరిమళాన్ని 2006 ఆగస్టు 15 దాకా వెదజల్లి భగవంతుని పాదాలపై రాలి శివైక్యం చెందారు.

ఆ సాహితీ మూర్తితో నా అనుభవాలు,అనుభూతులు మరువ లేనివి

వారు నాకు స్వయానా మేనమామ. మా అమ్మ గారికి ముద్దుల తమ్ముడు. ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామములో కీ.శే. శ్రీ గూడ రాఘవయ్య, శ్రీమతి సరస్వతమ్మలకు కలిగిన నాల్గవ సంతానం. మా అమ్మ పేరు వేంకట సుబ్బమ్మ, వారి పేరు వేంకట సుబ్రహ్మణ్యం. మేము చిన్న మామయ్య అని పిలుస్తాము. మా చినమామయ్యకు మా అమ్మ అంటే అపారమైన ప్రేమ, భక్తి, గౌరవం.

.......

చిన్నప్పుడు మమ్మల్ని తన భుజాల మీద ఎక్కించుకోని ఆడించిన రోజులు గుర్తున్నాయి. మా మామయ్యగారు వరంగల్లులోతెలుగుఉపన్యాసకునిగా పని చేస్తున్న రోజులలో అక్కడి కెళ్తే మమ్మల్ని ఆడిస్తూ వెయ్యిస్తంభాల గుడి , భద్ర కాళీ గుడి చూపించిన రోజులు బాగా గుర్తున్నాయి. మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆప్యాయముతో మేమడిగిన బొమ్మలు కొని మమ్మల్నానందింప చేయటం గుర్తుంది.

మా ఊరు కరవది అనే కుగ్రామం. వేసవి సెలవలకు మా అమ్మను చూడటానికి మా మామయ్య వచ్చేవారు. కరవదిలో మా ఇంటి పంచలో ఎప్పుడూ ఏదో పురాణ కాలక్షేపం జరుగుతుండేది. ఊరి జనం చాలామంది పురాణం వినడానికి వచ్చేవారు. అదే మా చిన్న మామయ్య వచ్చారంటే సగం ఊరు వచ్చి కూర్చుండేది. మామయ్య భాగవతం, భారతం చదివి వినిపించేవారు. మా మామయ్య గారి వాచకం అందరిని మంత్రముగ్ధులనిచేసేది. మేనమామగా మమ్మల్ని ఎన్నిసార్లు ఆటపట్టించారో చెప్పలేను. తన నోటినుండి వెలువడిన ప్రతి మాట ఎంతో ఆహ్లాదంగా ఉండేది.

...........

అది 1969 వ సంవత్సరం . నేను పీ.యూ.సి. ఉత్తీర్ణుడిని అయి MBBS లో సీటు సంపాదించుకోలేక ఏమి చేద్దామా అని ఆలోచించు సమయములో

హైదరాబాద్ హోమియో వైద్య కళాశాల నుండి నాకు ప్రవేశానికి అనుమతి వచ్చింది. సమస్య ఆర్థికంగా తట్టు కోలేమో నని. ప్రయత్నం మానుకొందామని. ఆ సమయంలో మా చినమామయ్య గారు ఉదారంగా అక్కయ్యా వాడిని నాదగ్గరకు పంపు ఇక్కడ చదువుకుంటాడులే అని నన్ను హైదరాబాదుకు పిలిపించు కొన్నారు.

నన్నొక వైద్యునిగా, ఆచార్యునిగా తీర్చిదిద్దటానికి దోహద పడ్డారు. నే నేమిచ్చి ఋణం తీర్చుకో గలను. నాకు మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. ఆయన స్పూర్తి నాకు ధైర్యం ఇచ్చింది.

ఆయన తెలుగు సాహిత్యం లో విమర్శకునిగా, రచయిత గా, అధ్యాపకునిగా, రీడరుగా, ఆచార్యునిగా, పరిశోధకునిగా, పరిశీలకునిగా, గొప్ప వక్తగా, పరిపాలనా దక్షత కలిగిన తెలుగు శాఖాద్యక్షునిగా, డీన్ గా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా, యువభారతి వెన్నెముకగా, దాదాపు 20మంది Ph.D లను 45మంది M.phil. తయారు చేసి, దాదాపు 35 గ్రంధాలు వేటికవే ఆణిముత్యాలుగా తీర్చిన తెలుగు తేజం జీవియస్.

......

నాకు తెలుసు ఆ రోజుల్లో నల్లకుంట నుండి నిజాం కాలేజి దాకా దశాబ్దాల పాటు సైకిలు త్రొక్కటం.

.....

నాకు తెలుసు ఎంతోమంది సాహితీవేత్తలు ఇంటికి రావడం, సాహిత్య గోష్టులు జరగటం, ఎంతో మంది సలహాలు తీసుకోవడం.

........

నాకు తెలుసు

ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి అత్యంత ప్రియమైన శిష్యుల్లో జీవిఎస్ మొట్ట మొదటి శిష్యునిగా నిలుస్తారు..

ఏదైనా కార్యక్రమానికి తాను వెళ్ళలేని సమయంలో ఆ బాధ్యత జీవియస్ మీద పడేది. ఆయనంటే అంత నమ్మకం.

ఒకసారి తెనాలిలో తెలుగు సభలకు ఆచార్య దివాకర్ల గారు వెళ్ళ వలసి వచ్చింది. తాను వెళ్ళలేక పోయి ఆ కార్యక్రమానికి జీవియస్ ను వెళ్ళమని కోరారు. గురువు గారి ఆజ్ఞ శిరసావహించారు.

తెనాలిలో నిర్వాహకులు దివాకర్ల వారిని రమ్మంటే ఎవరినో పంపారని అసంతృప్తి. సభలో కలకలం గుసగుసలు. మైకందుకొని ఉపన్యాసం మొదలయ్యిందో లేదో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఉపన్యాసం ముగిసిన దాకా ఆసక్తితో విని జయజయ ధ్వానాలు వినిపించారు. తరవాత రెండో రోజు కూడా ఉండమని బ్రతిమాలినారు. దానికి సరే అని ఆగిపోవడం జరిగింది. ఆ రోజుల్లో సమాచార సాధన లోపంతో ఆ విషయం హైదరాబాద్ లో ఉన్న మాకు తెలియలేదు. ఇంట్లో ఇంకారాలేదేమని కంగారు, భయం. ఆ రోజు మూడు సార్లు ఆచార్య దివాకర్ల గారింటికి వెళ్ళి సమాచారం కోసమడిగితే వాళ్ళకూ తెలియదంటున్నారు.

......

తెనాలిలో మర్నాడు సాయంత్రం సాహిత్యోపన్యాసానికి కవిసమ్రాట్ విశ్వనాథ వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జీవిఎస్ గారిని ఆయన సరసన వక్తగా కూర్చోబెట్టి నారు. ముందుగా మా చినమామయ్య(జీవిఎస్ ) ఉపన్యాసం. సభంతా కిక్కిరిసిపోయింది. అందరి హర్ష ధ్వానలతో ఉపన్యాసం ముగిసింది. కవిసమ్రాట్ జీవిఎస్ ప్రతిభకు ముగ్ధుడై ఎంతగానో కొనియాడారు. విశ్వనాథ వారు ఘనంగా సన్మానం చేశారు. సన్మాన నిమిత్తం అక్కడ ఆపారు.

ఆ తర్వాత రోజు ఇంటికి వచ్చి ఈ విషయాలు చెప్పి ఆనందం కలగ చేశారు.

_____________________

మా మామయ్య గారి సాహిత్య ప్రస్థానం

_____________________

అప్పుడు జీవిఎస్ వయసు 25 సంవత్సరాలు . వీర రసము అనే గ్రంధం వ్రాశారు. ఆ వ్రాసిన గ్రంధాన్ని తన స్వగ్రామం అయిన ఆదిపూడికి తీసుకుని వచ్చి మా తాతయ్యకు చదివి వినిపిస్తుంటే మా తాతయ్య ఉబ్బి తబ్బిబ్బవడం నేను కనులారా తిలకించాను , ఆ గ్రంధమునకు సాహిత్య అకాడమీ పురస్కారం రావడం అందరికీ గర్వకారణమయ్యంది.

సరస్వతీ పుత్రుడు కదా తెలుగు సాహిత్యాన్ని క్రొత్త పుంతలు త్రొక్కించారు.

పిన్న వయసులో పెద్ద పురస్కారం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ పురస్కారం మమ్మల్ని ఆనంద పరచింది

....

అంతకు మునుపు కొన్ని నాటకాలు నవలలు వ్రాసారు. సినీనటుడు త్యాగరాజును పగిలిన గోడలు నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేయించింది జీవిఎస్. ఆ ప్రదర్శనకు అంతర్విశ్వ విద్యాలయ పోటీలో ప్రథమ బహుమతి అందింది. మరుగున పడుతున్న తోలు బొమ్మలాటను స్వయంగా అట్ట బొమ్మలను చేసి ఆడించిన విషయం నాకు తెలుసు.

.............

నాకు తెలుసు ఆ రోజుల్లో భువనవిజయంలో తాను పోషించిన తెనాలి రామకృష్ణుడు పాత్ర ఎంత మంది ప్రశంస లందిందో. గుంటూరు శేషేంద్ర శర్మ గారు శ్రీకృష్ణదేవరాయలుగా. అల్లసాని పెద్దన గా ఆచార్య దివాకర్ల గారు, తిమ్మనగా ఆచార్య పాటిబండ మాధవశర్మ ,శ్రీ ఉత్పల మొదలగు సాహిత్య మేధావులందరితో కనులకు చెవులకు విందు చెయడం.

నేను హోమియోపతి వైద్యకళాశాల లో చేరిన క్రొత్త రోజులు. విద్యార్థులు కళాశాల దినోత్సవ వేడుకలు జరిపే రోజు. ఇంట్లో ఆ విషయం చెప్పాను. నన్ను త్వరగా రమ్మన్నారు. సరే అని వెళ్ళాను. కళాశాల కార్యక్రమం అయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యింది. ఆలస్యం అయ్యిందని అప్పటికి కానీ తెలిసి రాలేదు. కాచిగూడ నుండి సరైన బస్సు లేదు. నడుచుకుంటూ ఇంటికి చేరే సరికి రాత్రి 10 గంటలు. అందరూ ఆరుబైట ఆందోళనతో ఉన్నారు. మా మామయ్య గారైతే మా అత్తయ్యను నువ్వేమైనా ఆన్నావా? వాడేమైనా చెప్పకుండా వెళ్ళాడేమో అనేదాకా వెళ్ళింది.

ఆరోజు నన్ను చూసి మామయ్య ఇంకెప్పుడూ ఆలస్యంగా రాకని మందలించారు.

..........

మా మామయ్య గారికి హోమియో వైద్యముపై ఉన్న అవగాహన నన్నేంతో ఆశ్చర్య చకితుడిని చేసినది. మా మా మామయ్య గారు ఉదహరించిన ఒక విషయం నన్ను బాగా ఆకట్టుకున్నది.

విషాదంలో మునిగి పోయిన వారికి వాళ్ళ కన్నా ఎక్కువ బాధ పడుతున్న సంఘటనల నాటకాలు వ్రాసి వాటిని వారికి చూపించి తమ బాధ అల్పమైనది అని గ్రహించే విధంగా చేసి బాధలను తొలగించే వాడు. దీనిని కెథారిసిస్ అని అంటారు

హోమియోపతి సిద్ధాంతానికి సమీపంలో ఉండే చికిత్స పూర్వపు రోజుల్లో ఎలా అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం( 384 - 324) లో చేసేవాడని హోమియో వైద్య సదస్సులలో చెప్పేవాడిని. ఇదొక క్రొత్త విషయంగా గ్రహించే వారు

జీవిఎస్ CATHARSIS గురించి నాకు అవగాహన కలిగించి హోమియోపతిని క్రొత్త కోణంలో ఎలా చూడాలో చెప్పారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మహానీయునితొ మరియు వారింట్లొ నా అనుభవాలు ఒక చిన్న పుస్తకం అవుతుంది.

నాకు అలాంటి మహోన్నత మేనమామ దొరకటం ఎంతో అదృష్టం . వారు పైనుండి నాకు సదా ఆశీస్సులు అందచేస్తారు.

..........

శ్రీ పుట్టపర్తి సాయి సేవలు ఆయన ఆధ్యాత్మిక చింతనను పరాకాష్ట చేర్చిందనటంలో అతిశయోక్తి లేదు..

ఆయన గ్రంధ పఠనము, గ్రంధ రచనము ఆంధ్రమహాభారత ముఖ్యసంపాదకీయం తన జీవితానికి పరమార్ధం చేకూర్చింది.

"ఎన్నాళ్ళు బ్రతికావు, ఎలా బ్రతికావు అన్నది కాదు

ఎందుకోనం బ్రతికావు - ఏ అనుభవం కోసం బ్రతికావు అన్నది ఈ జీవిత లక్ష్యం " అనేదే ఆయన చివరి సందేశం

మహనీయడైన మా మామయ్యకు నా అంజలి ఘటిస్తున్నాను 

- ఆచార్య డా.శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి

Tags:    
Advertisement

Similar News