లే !చెలీ !
నాతోబాటు నడవాలి నువ్వు
ఇవాళ
గాలిలో యుద్ధకణాలు కదలాడుతున్నాయి
కాలానిదీ జీవితానిదీ
అదే ఊపిరి
సున్నితమైన గాజు చషకం
రాతి ఎండకు చుర్రుమంటుంది
సౌందర్యము , ప్రేమా
శ్రావ్యంగా మేళనమౌతాయి
నన్ను కాల్చే అగ్నికి
నువ్వూ రగుల్కొంటావు
లే ! నా ప్రేయసీ !
నువ్వూ నా వెంట నడవాలి
బ్రతుకు పోరాటం
సహనంలో నిర్బంధం కాదు
జీవితం కారే కన్నీటిలో కాదు
స్పందమాన రుధిరంలో వుంది
స్వేచ్చా పలాయనంలోని సుగంధం
జడ వెంట్రుకలలో లేదు
మగాడి పక్కనే కాని స్వర్గం ఒకటుంది
ఆ స్వేచ్ఛా పథంలో
నువ్వింకా తిరగాల్సే వుంది
లే ! నా ప్రియతమా !
నాతో బాటుగా నడవాలి నువ్వు
నీ కోసం
ప్రతి మూలా కాలుతున్న చితులు
నిరీక్షిస్తూ ఉంటాయి
కర్తవ్య ప్రచ్ఛన్న వేషంలోవుంది మృత్యువు
నీ ప్రతి సున్నిత అంగవిక్షేపమూ
ఒక శాపం
పిల్లగాలిలో గరళమే వుంది
శృంగారించదలిస్తే
ఋతువును మార్చు
లే !నా వలపా ! నువ్వు నాతో సాగాలి
దూరంగా వున్న నీ విలువ
చరిత్రకు తెలియదు
కేవలం కన్నీళ్లనేకాదు
కట్టెనిప్పులనూ మండిస్తావు నువ్వు
నువ్వు వినోద ఉపాఖ్యానానివే కాదు
కటిక వాస్తవానివి
కేవలం నీ యౌవనం కాదు
నీ వ్యక్తిత్వం కూడా వుంది
నీ చరిత్ర శీర్షికను నువ్వే మార్చాలి
లే ! ప్రియతమా !
నువ్వూ నా తోడు నడవాలి
పురాబంధనాల నుండి
బయటకు రా
సాంప్రదాయ ప్రతిమలను
బద్దలుకొట్టు
ఈ దుర్బల మృగతృష్ణలనూ
సుఖ బలహినతలనూ
గొప్పగా ఊహించుకునే
స్వయం నిర్మిత సరిహద్దులనూ .
ప్రేమపాశం సైతం ఓ దాస్యబంధమే
దారిలో ముళ్ళనేకాదు
పువ్వులను కూడా తొక్కుకుంటూ
పోవాల్సిందే !
లే ! నా ప్రియసఖీ !
నాతో నడవాలి నువ్వు
తప్పిదపు నిశ్చయ అనుమాన
ప్రబోధాలను ధ్వంసం చెయ్యి
సంకెళ్ళయిన ప్రార్థనలు
ఈ పచ్చల హారాలు
తెలివిపరులు తీర్మానించిన ప్రమాణాలు
బుడగలా ఆవిరిచేసి
ఓ తుఫానుగా మార్చాలి నువ్వు
లే !నా ప్రేయసీ !
నాతోబాటు నడవాలి నువ్వు
నువ్వు అరిస్టాటిల్ సిద్ధాంతానివి
సౌందర్యదేవతా రతివి
శుక్ర పుంజానివి
నీ పాదాలచెంత భూమ్యాకాశాలను
నియంత్రించే దానివి
అవును .లేవనెత్తు వేగంగా -
విధి పాదాలనుండి నీ శిరసునెత్తు !
నేనూ వ్యవధాన ఇవ్వను
కాలమూ ఇవ్వదు
ఎంతకాలం నీ సంకోచం
నువ్వు అచలవి కా !
నువ్వు ధీరవి కా !
లే ! నా ప్రియా !
నువ్వు నాతో సహచరించాలి
(కైఫీ ఆజ్మీ ఉర్దూ కవిత కు తెలుగు అనువాదము: సుధామ )