జగన్‌పై కోపం వచ్చింది.. ఇప్పుడు క్షమాపణ చెబుతున్నా- వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రెండు నెలల పాటు పాల్గొన్న తర్వాత తమ ఆలోచనే తప్పు.. జగన్ తీరే కరెక్ట్ అని తనకు అర్థమైందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో నిర్మించనున్న అసాగో బయో ఇథనాల్ యూనిట్‌కు ఏపీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రెండు నెలల పాటు పాల్గొన్న తర్వాత తమ ఆలోచనే తప్పు.. జగన్ తీరే కరెక్ట్ అని తనకు అర్థమైందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి పడితే వారి అకౌంట్లలో సీఎం జగన్ డబ్బులు వేయడం చూసి తనకు కోపమొచ్చిందన్నారు. మేం పోరాటం చేసిన శత్రువుల ఖాతాల్లోకి కూడా డబ్బులు వేస్తుండడంతో తనకు నిజంగానే జగన్‌పై విపరీతమైన కోపం వచ్చిందన్నారు. కార్యకర్తలు కూడా ఇదేంటి అని ప్రశ్నించేవారన్నారు. అయితే ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత తాము వెళ్లిన చోట్ల జనం హారతులు ఇచ్చి స్వాగతం పలకడం చూసి జగన్ ఆలోచనే కరెక్ట్ అని అర్థమైందన్నారు.
తాను ఒకపట్టాన నిర్ణయం మార్చుకునే వ్యక్తిని కాదని.. అలాంటిది తానే ఆలోచన మార్పుకున్నానని వివరించారు. ఎక్కడికి వెళ్లినా రాజకీయాలకు అతీతంగా తమబాగోగులు చూస్తున్నది ఒక్క జగనే అని జనం చెబుతున్నారని వివరించారు. గతంలో జగన్ మీద కోపం తెచ్చుకున్నందుకు ఇప్పుడు తాను సభాముఖంగా క్షమాపణ చెబుతున్నానని చంటిబాబు చెప్పారు.