మారుతున్న కండువాలు.. స్పీడ్ మీదున్న స్థానిక నేతలు

వైసీపీకి చెందిన స్థానిక సంస్థల నేతలు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.

Advertisement
Update:2024-07-31 17:36 IST

ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత, నేతల వలసలను అందరూ ఊహించారు. కానీ తెలంగాణలో ఉన్నంత జోరు ఏపీలో కనపడటం లేదు. కొంతమంది వైసీపీకి దూరం జరిగినా, రాజీనామాలు చేసినా, వారింకా అధికారికంగా కూటమి పార్టీల్లోకి రాలేదు. స్థానిక నేతలు మాత్రం ఈ విషయంలో స్పీడ్ మీదున్నారు. ఇటీవల విశాఖకు చెందిన కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. తాజాగా కుప్పంలో 15మంది ఎంపీటీసీలు, ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు.

వైనాట్ కుప్పం అంటూ గతంలో వైసీపీ హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ, బదులు తీర్చుకోవాలనుకుంటోంది. కుప్పంలో వైసీపీని ఖాళీ చేయాలనుకుంటున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కి ఆ బాధ్యత అప్పగించారు సీఎం చంద్రబాబు. ఆయన ఆధ్వర్యంలో స్థానిక నేతలు నేడు ఉండవల్లిలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరతారని అంటున్నారు.

గెలవడంకోసం డబ్బులు ఖర్చుపెట్టే నాయకులు, గెలిచిన తర్వాత వాటిని ఎలా రాబట్టుకోవాలో ఆలోచిస్తారు. అలాంటి వ్యూహాల్లో ఉన్న నేతలు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటం కష్టం. అందుకే స్థానిక నేతలు అధికార పార్టీలోకి మారేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రస్తుతం కుప్పంలో జరుగుతోంది అదే. ఇటు రాష్ట్ర స్థాయి నేతల్లో కూడా కొందరు వైసీపీకి దూరం జరిగారు, మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు, ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. ఆమధ్య వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆ చేరికలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతానికి స్థానిక నేతలు మాత్రం స్పీడ్ పెంచారు. త్వరలో రాష్ట్ర స్థాయి నేతలు, వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, కీలక నేతలు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. 

Tags:    
Advertisement

Similar News