విజయమ్మ వీడియో.. విజ్ఞత ఉన్న సందేశం
ఇన్నాళ్లూ షర్మిల, సునీత చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విజయమ్మ ఎక్కడా సమర్థించకపోవడం విశేషం. వివేకా హత్యకేసుని ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు, ఆ కేసుని అడ్డు పెట్టుకుని షర్మిలను గెలిపించాలని అడగలేదు.
ఎన్నికల ప్రచారానికి సమయం పూర్తి కావస్తున్న దశలో వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ ఓ వీడియో విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఆమె తన కుమార్తెకు మద్దతిచ్చారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి షర్మిలను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వీడియోలో విజయమ్మ ఎక్కడా వైసీపీ గురించి ప్రస్తావించలేదు, జగన్ పాలనపై మాట్లాడలేదు. తన కుమార్తెను గెలిపించండి అని మాత్రమే ప్రజలకు విన్నవించారు విజయమ్మ.
విజయమ్మ సంస్కారం..
"కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం ఆమెకు కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపించండి." అని విజ్ఞప్తి చేశారు విజయమ్మ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఆమె ఎక్కడా షర్మిల ప్రత్యర్థుల గురించి మాట్లాడలేదు. వైఎస్ఆర్ లాగే ప్రజా సేవ చేసేందుకు ఆయన ముద్దుబిడ్డ షర్మిలను గెలిపించి పార్లమెంట్ కి పంపించండి అని మాత్రమే చెప్పారు. ఇన్నాళ్లూ షర్మిల, సునీత సహా ఇతర కొంతమంది నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విజయమ్మ ఎక్కడా సమర్థించకపోవడం విశేషం. వివేకా హత్యకేసుని ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు, ఆ కేసుని అడ్డు పెట్టుకుని షర్మిలను గెలిపించాలని అడగలేదు.
విజయమ్మ వీడియోతో ఎల్లో మీడియా పండగ చేసుకుంటోంది కానీ.. ఆమె ఎక్కడా జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వైసీపీ అభ్యర్థిని ఓడించాలని కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో విజయం సాధించాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆకాంక్షించలేదు. కేవలం తన కుమార్తె గెలవాలని మాత్రమే విజయమ్మ కోరుకున్నారు. అయితే విజయమ్మ, జగన్ ని కాకుండా షర్మిలను సపోర్ట్ చేస్తూ వీడియో విడుదల చేశారంటూ ఎల్లో మీడియా రచ్చ చేస్తోంది.