తల వంచం, వెన్ను చూపం.. ఆఫీసు కూల్చివేతపై జగన్ ఆగ్రహం
ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు కూల్చివేతపై స్పందించారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్. చంద్రబాబు తీరు ఓ నియంతలా ఉందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనతో రాబోయే ఐదేళ్ల బాబు పాలన ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చన్నారు జగన్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
జగన్ ట్వీట్ ఇదే..
'ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలి' అని కోరారు జగన్.
మరోవైపు నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన జగన్.. ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఇదే ఆయన తొలి పర్యటన. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ 3 రోజులు రాయలసీమ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.