మేనిఫెస్టోపై వైసీపీ ముమ్మర కసరత్తు.. రేపే విడుదల..!
2019 ఎన్నికల్లో తాము ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం అములు చేశామని జగన్ సగర్వంగా ప్రకటిస్తున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వని అంశాలు చాలా ఆయన ప్రభుత్వంలో జరిగాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈరోజు దీనిపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే కొలిక్కివచ్చిన మేనిఫెస్టోపై ముఖ్య నాయకులతో చర్చించి, మరింత మెరుగులు దిద్దేందుకు జగన్ సన్నద్ధమవుతున్నారు.
రేపే విడుదల!
జగన్ ఈ నెల 28 అంటే శుక్రవారం నుంచి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో ప్రజల్ని కలిసేందుకు జగన్ ఈ ప్రచారం చేపట్టబోతున్నారు. దానికి ముందుగానే అంటే రేపే నామినేషన్ రిలీజ్ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
2019 మేనిఫెస్టోలో 99% అమలు
2019 ఎన్నికల్లో తాము ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం అములు చేశామని జగన్ సగర్వంగా ప్రకటిస్తున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వని అంశాలు చాలా ఆయన ప్రభుత్వంలో జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసి, ప్రజలకు సమాధానం కూడా చెప్పకుండా పలాయనం చిత్తగించిన సంగతినీ వైసీపీ నాయకులు పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
సర్వత్రా ఉత్కంఠ
నిన్న మొన్నటి వరకు నోటికొచ్చినట్లు తిట్టిన వాలంటీర్లకు నెలకు రూ.10వేలు గౌరవ వేతనమిస్తామని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. పింఛను నాలుగు వేలు చేస్తామనీ చెబుతున్నారు. ఇవన్నీ జనం నమ్ముతారా లేదా అన్నది పక్కనపెడితే వీటన్నింటినీ మించి మరిన్ని సంక్షేమ పథకాలకు, ప్రజాకర్షక పథకాలకు వైసీపీ మేనిఫెస్టోలో చోటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత మేనిఫెస్టోలో హామీలను 99 శాతం పూర్తిచేసి రికార్డు సృష్టించిన జగన్ కొత్త మేనిఫెస్టోలో ఏం ప్రకటిస్తారోనని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.