పెళ్ళికొడుకు వీడే.. కానీ వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదే.. ఈనాడు సవరణపై వైసీపీ ర్యాగింగ్

ఈనాడు పత్రిక తాము తప్పు చేసినట్లు ఒప్పుకోవడంతో ఈ తప్పును సాక్షి, వైసీపీ డిజిటల్ మీడియా జనం దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డాయి. ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ మీడియా చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement
Update:2023-02-23 15:51 IST

దేశంలోనే అతి పెద్ద డైలీ పత్రిక అని చెప్పుకునే ఈనాడు.. తెలిసి చేసిందో.. కావాలని చేసిందో.. కానీ పట్టాభి వ్యవహారానికి సంబంధించి మెయిన్ పేపర్ ఫస్ట్ పేజీలో గ‌న్న‌వ‌రం ఘటనకు సంబంధించిన ఫొటోలు కాకుండా.. 2021 నాటి పాత ఫొటోలు ప్రచురించి సాక్షికి అడ్డంగా దొరికిపోయింది. ఇక అంతే ఈనాడుపై సాక్షి ర్యాగింగ్ మామూలుగా లేదు. మొదటినుంచి ఈనాడు తాను భుజాన మోస్తున్న పార్టీ గురించి అబద్ధాలు చెబుతోందని.. సాక్షి పత్రిక వచ్చిన తర్వాతే అబద్దాల వెనుక ఉన్న కోణాలను వెలికితీస్తున్నట్లు ప్రకటించింది.

ఈనాడు చేసిన పనిని అటు సాక్షి పత్రిక, ఇటు వైసీపీ జనంలోకి బలంగా తీసుకువెళ్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైసీపీ డిజిటల్ మీడియా ఈనాడు పత్రిక కావాలని ప్రచురించిన పాత ఫొటోల గురించి నెటిజన్ల దృష్టికి తీసుకెళ్తోంది.

గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం ఘటనలో టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో తన ముఖానికి టవల్ కట్టి ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని తన చేతులు, అరికాళ్లకు దెబ్బలు తగిలినట్లు పట్టాభి కోర్టులో న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈనాడు పత్రిక మెయిన్ ఫస్ట్ పేజీలో ప్రచురించింది.

అయితే ఈ క్రమంలో రెండేళ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో పట్టాభికి గాయాలు కాగా, ఆ ఫొటోలను ఈనాడు ప్రచురించి పట్టాభి శరీరంపై ఉన్న గాయాలు అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే సాక్షి మీడియా ఈనాడు చేసిన తప్పు పనిని గుర్తించింది. పట్టాభికి గాయాలు ఉన్న ఫొటోలు పాతవి అంటూ సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో దొరికిపోయామని భావించిన ఈనాడు ఇవాళ ఒక సవరణను ప్రచురించింది.

అందులో..' గన్నవరం తెదేపా కార్యాలయ విధ్వంస ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నేత పట్టాభి పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బుధవారం ఈనాడు పత్రికల్లో ప్రచురించిన ఫొటోల్లో తప్పు జరిగింది. దెబ్బలు కొట్టినట్లు పట్టాభి తన చేతిని చూపిస్తున్న చిత్రం మంగళవారం తీసిందే. అయితే కాళ్లపై కొట్టినట్లు వచ్చిన ఫొటోలు మాత్రం 2021 నాటివి. సాంకేతిక కారణాల వల్ల జరిగిన ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఈ తప్పును గుర్తించిన వెంటనే ఈనాడు డిజిటల్ ఎడిషన్ లోనూ ఈనాడు. నెట్ లోనూ పాత ఫొటోలను తొలగించాం.' అని ఈనాడు ఒక సవరణను ప్రచురించింది.

ఈనాడు పత్రిక తాము తప్పు చేసినట్లు ఒప్పుకోవడంతో ఈ తప్పును సాక్షి, వైసీపీ డిజిటల్ మీడియా జనం దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డాయి. ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ మీడియా చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. 'రజనీకాంత్ సినిమాలో పెళ్ళికొడుకు వీడే.. కానీ వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదే.. అనే డైలాగు గుర్తుకొచ్చింది.. వీళ్ళ సవరణ చూస్తే..' అని ఒక ట్వీట్ చేసి దానికి ఈనాడులో ప్రచురించిన సవరణను కూడా యాడ్ చేసింది. వైసీపీ డిజిటల్ మీడియా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా ఈనాడు చేసిన పనిని తప్పుపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News