అమిత్‌ షా పిల్లలు, మనవలు ఏ మీడియంలో చదివారు?

అమిత్‌షా కూడా రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టునే వల్లె వేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

Advertisement
Update:2024-05-06 09:29 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి వారి బంగారు భవిష్యత్తు కోసం జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. దానిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తప్పుపట్టడం శోచనీయమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు ఇంగ్లిష్‌ మీడియంపై ఇన్ని మాటలు చెబుతున్న అమిత్‌షా గాని, ఇతర నేతలు గాని తమ పిల్లలు, మనుమలను ఏ మీడియంలో చదివించారు, చదివిస్తున్నారని ఆయన గట్టిగా నిలదీశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం స‌జ్జ‌ల‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అట్టడుగు, వెనుకబడిన వర్గాల వారు తమతో సమానంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని పెత్తందార్లు ఇంగ్లిష్‌ మీడియంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

94 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కోరుకున్నారు..

క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే 94 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి బిడ్డలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలని ఆకాంక్షించారని సజ్జల చెప్పారు. కానీ, ఇంగ్లిష్ మీడియం పేదల పిల్లలకు అందని ద్రాక్షలా మారిందన్నారు. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించాలంటే భారీగా అప్పులు చేయాల్సి వచ్చేదని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ దుస్థితి నుంచి వారిని బయటపడేశారన్నారు. నాణ్యమైన విద్యను హక్కుగా అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. అయినా ఎక్కడైనా తెలుగు ప్రాభవం తగ్గిందా? ఇళ్లలో తెలుగులో మాట్లాడుకోవడం మానేశారా? ఎంత ఇంగ్లిష్‌ నేర్చుకున్నా మన తల్లి భాష ఎక్కడికీ పోదని ఆయన చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని ఒక సెక్షన్‌ ఆఫ్‌ మాఫియా అడ్డుకుంటోందని మండిపడ్డారు. తెలుగు భాషను చంద్రబాబు ఉద్ధరించింది లేదు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తగ్గించిందీ లేదని సజ్జల చెప్పారు. ఇంకా సీఎం జగన్‌ తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు.

అమిత్‌షా కూడా బాబు స్క్రిప్టునే చదువుతున్నారు...

అమిత్‌షా కూడా రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టునే వల్లె వేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. భూ దోపిడీలకు కేరాఫ్‌ అయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు. 2014లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. ఏ ముఖం పెట్టుకుని మరోసారి జట్టు కట్టారని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఇస్తామని అమిత్‌షా ఇప్పుడు చెప్పడం కాదని, విభజన హామీల్లోనే ఈ ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాలని ఉందని గుర్తుచేశారు. ఇదేమీ దానం, ధర్మం కాదని చెప్పారు. ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ లెక్కలు కేంద్రం వద్దే ఉంటాయని, అమిత్‌షా అవి చూసి మాట్లాడాలని సజ్జల అన్నారు. అవినీతి, వివక్ష లేని పాలన అందిస్తుంటే అవినీతి ముద్ర ఎలా వేస్తారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News