ప్రియుడిపై మోజు.. భర్తకు ఉరితాడు
భర్తను హత్య చేసి రాత్రికి రాత్రే దహనం చేసి , ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ డ్రామా చేయాలని చూసినా పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.
ప్రియుడి మీద మోజుతో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. విశాఖలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసి రాత్రికి రాత్రే దహనం చేసి , ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ డ్రామా చేయాలని చూసినా పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఎంవిపి కాలనీకి చెందిన జ్యోతికి, భీమిలి మండలం వలందపేటకు చెందిన పైడిరాజుకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైడిరాజు టైల్స్ పనులు చేస్తుంటాడు. జ్యోతికి వివాహానికి ముందే నూకరాజు అనే వ్యక్తితో పరిచయం ఉండేది. ఇటీవల తిరిగి నూకరాజుతో సాన్నిహిత్యం పెంచుకుంది ఆమె.
ప్రియుడుని కలిసేందుకు గాను.. సిబిఐ ఆఫీస్‌లో హౌస్ కీపింగ్ పనిలో చేరానని చెప్పి రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేది. అలా వెళ్లి ప్రియుడు నూకరాజుకు సంబంధించిన గదిలో పగలంతా గడిపేది. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేది. అయితే శాశ్వతంగా కలిసి ఉండాలని భావించిన జ్యోతి, ప్రియుడు నూకరాజు ఆమె భర్త పైడిరాజును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
గత నెల 29వ తేదీన పైడిరాజుకు భోజనంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టింది జ్యోతి. పైడిరాజు పూర్తిగా నిద్రలోనికి జారుకున్న తర్వాత అర్ధరాత్రి ప్రియుడు నూకరాజుకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. అలా జ్యోతి ఇంటికి వచ్చిన నూకరాజు పైడిరాజుని తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తానుంటున్న గది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ అంబులెన్స్ కు ఫోన్ చేసి తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ రప్పించాడు. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది పైడిరాజు చనిపోయాడని నిర్ధారించారు. అయితే తమకు ఎవరూ లేరని పెద్దగా డబ్బులు కూడా లేవంటూ శ్మశానం సమీపం వరకు అదే అంబులెన్స్ లో పైడిరాజు మృతదేహాన్ని తీసుకెళ్లారు.
ఆ తర్వాత పైడిరాజు మృతదేహాన్ని దహనం చేసి బూడిద మొత్తం తీసుకెళ్లి సముద్రంలో కలిపేశారు. ఆ మరుసటి రోజు నుంచి తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి డ్రామా మొదలుపెట్టింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మృతుడు పైడిరాజు తమ్ముడు తన వదినపైనే అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసుల విచారణలో ఆమె సిబిఐ కార్యాలయంలో పనిచేయడం లేదని తేలింది. జ్యోతి ఫోన్ కాల్స్ ని విశ్లేషించి నూకరాజు, జ్యోతి కలిసే పైడిరాజుని ఒక పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు తేల్చారు.