ప్రియుడితో సాయిప్రియను పంపించేసిన పోలీసులు.. అసలేం జరిగింది?

ఇంకా వివాదం ఏమైనా ఉంటే.. అసలు భర్తతో బయటగానీ, కోర్టులో గానీ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు సాయిప్రియ తాను కోరుకున్న ప్రియుడి దగ్గరకే చివరకు చేరడంతో ఈ వివాదానికి తెరపడింది.

Advertisement
Update:2022-07-30 09:36 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వైజాగ్ సాయిప్రియ కేసుకు పోలీసులు ఎండ్ కార్డ్ పడేశారు. మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తెచ్చిన ఈ కేసును సున్నితంగా హ్యాండిల్ చేసిన పోలీసులు.. మొత్తానికి సాయిప్రియ కోరుకున్నట్లే ప్రియుడితో పంపించేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం ఎన్ఏడీ సమీపంలోని సంజీవయ్య నగర్‌కు చెందిన సాయి ప్రియ (22)కు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో పెళ్లిచేశారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లో జాబ్ చేస్తుండగా.. సాయి ప్రియ మాత్రం వైజాగ్‌లో ఉంటోంది.

ఈ నెల 25న తమ రెండో పెళ్లి రోజు కావడంతో శ్రీనివాస్ భార్యను కలవడానికి వైజాగ్ వచ్చాడు. ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతుండగా అతడి కళ్లుగప్పి సాయి ప్రియ వెళ్లిపోయింది. అయితే భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందనే ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల పాటు నేవీ హెలీకాఫ్టర్లు, స్పీడ్ బోట్లతో గాలింపు చేపట్టారు. కానీ సాయిప్రియ సముద్రంలో మునిగిపోలేదని.. ఆమె సురక్షితంగా ఉన్నట్లు బంధువులు గుర్తించారు.

పెళ్లికి ముందే ప్రేమించిన రవితో కలిసి బెంగళూరులో ఉన్నట్లు తేలింది. సాయిప్రియ స్వయంగా తండ్రికి వాట్సప్ మెసేజెస్ చేసి.. తాను బెంగళూరులో రవితో క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. తన కోసం వెతకవద్దని కోరింది. ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటూ.. తాళి కట్టించుకున్న ఫొటోను పంపింది. తన కోసం వెతికితే చనిపోతానని.. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయాని తల్లిదండ్రులను వేడుకుంది.

కాగా, పోలీసులు సాయిప్రియతో పాటు రవిని కూడా వైజాగ్ తీసుకొని వచ్చారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి భర్త శ్రీనివాస్‌తో పంపాలని భావించారు. శుక్రవారం వైజాగ్ పోలీసులు ఆ మేరకు శ్రీనివాస్‌కు కబురు పెట్టారు. కానీ సాయిప్రియపై ఆగ్రహంతో ఉన్న శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. మరోవైపు తాను రవితోనే ఉంటానని పోలీసులకు సాయిప్రియ తేల్చి చెప్పింది. అసలు భర్త ఎంతకూ రాకపోవడం, సాయిప్రియ మేజర్ కావడంతో చివరకు ఆమెను రవితో పంపించేశారు. ఆమె ఇష్టం మేరకే వ్యవహరించామని.. ఇంకా వివాదం ఏమైనా ఉంటే.. అసలు భర్తతో బయటగానీ, కోర్టులో గానీ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు సాయిప్రియ తాను కోరుకున్న ప్రియుడి దగ్గరకే చివరకు చేరడంతో ఈ వివాదానికి తెరపడింది.

కాగా, అందరినీ ఇబ్బంది పెట్టినందుకు తమను క్షమించాలని సాయిప్రియ, రవి వేడుకున్నారు. చిన్నప్పటి నుంచి రవిని ఇష్టపడ్డాను.. శ్రీనివాస్‌తో ఇష్టంలేని పెళ్లి చేశారని సాయిప్రియ చెప్పింది. పెళ్లి రోజు శ్రీనివాస్ గిఫ్ట్‌గా ఇచ్చిన రెండు బంగారు గాజులు తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది. తాను చదువుకున్నానని, ఉద్యోగం చేసి సాయిప్రియను పోషిస్తానని రవి కూడా అంటున్నారు. తమ వల్ల ఇబ్బంది పడిన వారందరినీ క్షమాపణలు కోరాడు.

Tags:    
Advertisement

Similar News