సముద్రంలో మునిగి ఇద్దరు మృతి.. - మరో ఇద్దరు గల్లంతు

స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో మత్స్యకారుల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి జాల కిశోర్, గోటికల తేజల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి.

Advertisement
Update:2024-06-22 09:22 IST

విహార యాత్ర విషాదాంతమైంది. సరదాగా గడిపేందుకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌కి వెళ్లిన‌ 12 మంది యువకుల్లో నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 12 మంది స్నేహితులు రామాపురం బీచ్‌కు విహార యాత్ర నిమిత్తం వెళ్లారు. వీరంతా సముద్రంలో స్నానాల కోసం దిగారు. వారిలో గోటికల తేజ (18), జాల కిశోర్‌ (18), కోరు అమలరాజు (19), చక్కమాల నితిన్‌ (18) లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అదే సమయంలో పెద్దగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన స్నేహితులు వారి కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది.

దీంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో మత్స్యకారుల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి జాల కిశోర్, గోటికల తేజల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. చక్కమాల నితిన్, అమలరాజు ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం మెరైన్‌ పోలీస్‌, మత్స్యకారులు గాలిస్తున్నారు. గోటికల తేజ ఐటీఐ చదువుతుండగా, జాల కిశోర్‌ పెళ్లిళ్లకు డెకరేషన్‌ చేస్తుంటాడు. చక్కమాల నితిన్‌ పాలిటెక్నిక్‌ చదువుతుండగా, కోరు అమలరాజు ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం ఏఎస్‌ఐ శివకుమారి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. యువకులిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆస్పత్రి తరలించారు.

Tags:    
Advertisement

Similar News