శ్రీ గోవిందరాజస్వామి సత్రాలను ఆధునీకరిస్తాం.. - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

యాత్రికుల వసతి గదుల పరిశీలనలో భాగంగా ఉచిత గదుల ప్రాంగణంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం జాక్వా పట్టణానికి చెందిన భక్తులతో టీటీడీ చైర్మ‌న్ మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో దర్శనం, భోజనం, ఇతర సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.

Advertisement
Update:2022-09-01 05:45 IST

తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలోని శ్రీ గోవిందరాజ స్వామి సత్రాలను ఆధునీకరించి సామాన్య భక్తులకు మరింత మెరుగైన వసతులు సమకూరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం రెండవ, మూడవ సత్రాలను ఆయ‌న‌ పరిశీలించారు. భక్తులకు ఉచితంగా కేటాయిస్తున్నగదుల్లో మంచాలు, పరుపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత, రూ.50 అద్దె గదుల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించారు. గదులతో పాటు వీటిలో కూడా లీకేజీలు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గదులతో పాటు ఖాళీ ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. సామూహిక వంటశాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి యాత్రికులు ఉపయోగించుకునే ఏర్పాటు చేయాలని అధికారులకు వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి వసతులు లేవు: మధ్యప్రదేశ్ భక్తులు

యాత్రికుల వసతి గదుల పరిశీలనలో భాగంగా ఉచిత గదుల ప్రాంగణంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం జాక్వా పట్టణానికి చెందిన భక్తులతో టీటీడీ చైర్మ‌న్ మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో దర్శనం, భోజనం, ఇతర సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. తాము 22 రోజుల దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చామని భక్తులు తెలిపారు. కర్ణాటక, తమిళనాడులోని అనేక ఆలయాలు సందర్శించామని, తిరుపతి, తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు దేశంలో ఏ ఆలయంలో కూడా తాము చూడలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత వసతి గదులు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి తిరుమలలో పరిశుభ్రత, పార్కులు, పరిసరాలు చాలా గొప్పగా ఉన్నాయని వారు చెప్పారు. నాలుగు గంటల్లోనే తమకు స్వామివారి ఉచిత దర్శనం అయ్యింద‌ని తెలిపారు. తాను మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే, అధికారులకు ఫిర్యాదు చేసిన గంటల్లోనే తిరిగి అప్పగించారని ఒక భక్తుడు చైర్మన్‌కు తెలిపారు.

Delete Edit

అన్ని వసతులు బాగున్నాయి: గొల్లప్రోలు భక్తుడు చక్రం

తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల్లో తాము బుధవారం రూ.50 అద్దె చెల్లించి గది తీసుకున్నామని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన చక్రం అనే భక్తుడు చైర్మన్‌కు తెలిపారు. వసతులు బాగున్నాయని, తిరుమలలో స్వామివారి దర్శనం మూడు గంటల్లోనే అయ్యిందని చెప్పారు. కొండ మీద అన్నదానం చాలా బాగుందన్నారు.

ఉచిత గదుల్లోనూ వసతులు: చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు ఉచితంగా కేటాయిస్తున్న గదుల్లో కూడా మంచాలు, పరుపులు, ఇతర కనీస వసతులు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 61 సంవత్సరాల క్రితం సత్రాలు నిర్మించారని, కరోనా వల్ల రెండేళ్ళ పాటు వీటిని భక్తులకు కేటాయించలేకపోయామన్నారు. అందువల్ల కొంత మేరకు మరమ్మతులు అవసరమవుతాయన్నారు. వీటికి అవసరమైన మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ దాకా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జేఈవో వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో భారతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News