విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం మరిచిపోకముందే మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. విజయననగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది.
ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటివరకూ దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో నడిచే రైళ్లన్ని రద్దయినట్లు సమాచారం. అయితే ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పట్టాలపై ఓ రైలు ఉండగా మరో రైలు ఎలా వెళ్లిందనేది తెలియాల్సి ఉంది.