తిరుమల చిరుత ఘటన.. హైకోర్టు కీలక ఆదేశాలు
మొత్తం రూ.15లక్షల రూపాయలను ఆ కుటుంబానికి పరిహారంగా అందించింది టీటీడీ. అయితే లక్షిత కుటుంబానికి అదనంగా మరో 15 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించడం ఆసక్తికరంగా మారింది.
తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల లక్షిత అనే చిన్నారి దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు చిరుతలను బంధించి తిరుపతి జూ పార్క్ కి తరలించారు అధికారులు. చిరుతల అలికిడి లేకపోవడంతో ప్రస్తుతం అలిపిరి మార్గంలో కాలినడక భక్తులకు కాస్త ధైర్యం వచ్చింది. అయితే జరిగిన దుర్ఘటనలో బాధితురాలి కుటుంబానికి మాత్రం సరైన న్యాయం జరగలేదని అంటున్నారు కొంతమంది. ఇటీవల బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కూడా లక్షిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇప్పించాలని, నడక మార్గంలో కంచె ఏర్పాటు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంలో ఏపీ హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్షిత కుటుంబానికి మరో 15 లక్షల రూపాయలు అదనంగా పరిహారం చెల్లించాలని సూచించింది. అదనపు పరిహారం అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లక్షిత ఘటన తర్వాత టీటీడీ రూ.5లక్షలు, అటవీ శాఖ రూ.5లక్షలు లక్షిత కుటుంబానికి పరిహారంగా ప్రకటించాయి. ఆ తర్వాత మొత్తం రూ.15లక్షల రూపాయలను ఆ కుటుంబానికి పరిహారంగా అందించారు. ఇదే విషయాన్ని హైకోర్టులో ప్రస్తావించారు టీటీడీ తరపు న్యాయవాదులు. అయితే లక్షిత కుటుంబానికి అదనంగా మరో 15 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించడం ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వానికి, టీటీడీకి నోటీసులు..
ఇక ఇనుప కంచె విషయంలో కూడా టీటీడీకి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటుపై అభిప్రాయాలను కోరింది. కేసు విచారణ వాయిదా వేసింది. \
♦