35వ మలుపు వద్ద చిరుత.. ఘాట్ రోడ్ లో భయం భయం

చిరుతకోసం బోనులు ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. బోన్లు, ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది.

Advertisement
Update:2023-08-13 13:07 IST

తిరుమల నడకదారితోపాటు, ఘాట్ రోడ్ లో కూడా భక్తులు భయంతో వణికిపోతున్నారు. మొదటి ఘాట్ రోడ్ లోని 35వ మలుపు వద్ద చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రోడ్డువైపు రాబోతున్న చిరుత వాహనాల సైరన్ విని అడవిలోకి పారిపోయినట్టు విజిలెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఆ చిరుత మళ్లీ ఘాట్ రోడ్ వైపు వస్తుందా లేక, కాలినడక మార్గం వైపు వెళ్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి చిరుత ఆ పరిసరాల్లోనే సంచరిస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అనే భయం భక్తుల్లో ఉంది.

అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుతకు బలైన తర్వాత మెట్లమార్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు టీటీడీ అధికారులు. సెక్యూరిటీ పెంచారు, భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విడివిడిగా వస్తే కదలనివ్వడంలేదు, కొంతమంది సమూహం అయిన తర్వాతే వారిని మెట్లెక్కేందుకు అనుమతిస్తున్నారు.

చిరుత వేట..

మరోవైపు గతంలో బాలుడిపై దాడి చేసిన చిరుత, ప్రస్తుతం బాలికను బలి తీసుకున్న చిరుత ఒకటేనా కాదా అనేది తేలలేదు. చిరుతకోసం బోనులు ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. బోన్లు, ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. ఈసారి చిరుతని పట్టుకుంటే, దాన్ని అడవిలో వదిలేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. జూకి తరలిస్తారని అంటున్నారు. నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం వచ్చిందంటే చాలు భక్తులు తెలియని ఆందోళనకు లోనవుతున్నారు. అందుకే అక్కడ కూడా సిబ్బందిని మోహరించింది టీటీడీ. శాశ్వత పరిష్కారం దిశగా ఓ కమిటీని నియమించి నివేదిక సిద్ధం చేయిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News