'మూడు రాజధానులు'.. ఇదే వైసీపీ ఎన్నికల నినాదం?

మూడు రాజధానుల సెంటిమెంట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని ఏపీ సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇటీవల చేయించుకున్న పలు సర్వేల్లో కూడా అదే విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని కట్టడి చేయాలంటే ఇదే సరైన నినాదమని కూడా పార్టీ భావిస్తోంది.

Advertisement
Update:2022-09-18 08:57 IST

ఏ పార్టీ అయినా ఎన్నికల బరిలో దిగితే ఏదో ఒక భావోద్వేగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడాలని భావిస్తుంది. బీజేపీ మత ఎజెండా, టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ వంటివి ఇలాంటి భావోద్వేగాలే. రాష్ట్రం విడిపోయినప్పుడు 'అనుభవజ్ఞుడైన పరిపాలకుడు' ఉండాలనే నినాదంతో టీడీపీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీకి భావోద్వేగాల కంటే టీడీపీపై వ్యతిరేకత, జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు అధికారాన్ని తెచ్చిపెట్టింది. మరి 2024లో వైసీపీని తిరిగి గెలిపించాలంటే ఏం చేయాలి? సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు అని ఎన్నికల బరిలోకి దిగితే అనుకున్నంత మేర సీట్లు సాధించలేమని సీఎం జగన్‌కు కూడా తెలుసు. అందుకే 'మూడు రాజధానులు' అనే సెంటిమెంట్‌ను వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 3న రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అప్పుడే ఈ తీర్పుపై సుప్రీంకోర్టకు వెళ్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, తీర్పు వచ్చి ఆర్నెళ్లు గడిచిపోయిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

మూడు రాజధానుల సెంటిమెంట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని ఏపీ సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇటీవల చేయించుకున్న పలు సర్వేల్లో కూడా అదే విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని కట్టడి చేయాలంటే ఇదే సరైన నినాదమని కూడా పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు అమరావతి రాజధాని అనే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో మూడు రాజధానులు అంటే తమ ప్రాంతంలో ఏదో ఒక రాజధాని వస్తుందనే ఆశతో కూడా ఉన్నారు. అమరావతిని ఆనుకొని ఉన్న కృష్ణ, గుంటూరు ప్రాంతంలో ఈ విషయంలో కాస్త వ్యతిరేకత వచ్చినా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో మాత్రం ఓట్లర్లను తమవైపు తిప్పుకోవడానికి ఈ నినాదం పనిచేస్తుందని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని టీడీపీ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో అమరావతి రైతుల ఉద్యమం, పాదయాత్ర అంతా టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్‌గా వైసీపీ ప్రచారం చేస్తోంది.

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసేయడం లేదని.. కేవలం పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ సహా మంత్రులు కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాజధానుల విషయంలో కాస్త గట్టిగానే అసెంబ్లీలో ప్రసంగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే మూడు రాజధానుల విషయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలవాలని సవాలు విసిరారు. రాజధానుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామని టీడీపీ నేతలు కూడా సంతోషించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఏకంగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో అవాక్కయ్యారు. ఇది కచ్చితంగా టీడీపీపై వైసీపీ మాస్టర్ స్ట్రోక్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2024 ఎన్నికలు 'మూడు రాజధానులు వర్సెస్ అమరావతి'గా ఉండబోతోందని సీఎం జగన్ చెప్పకనే చెప్పారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2019లో నవరత్నాలు వైసీపీకి అధికారాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం పూర్తి చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని అనుకోవడం లేదు. కాబట్టి 2024 ఎన్నికలకు '3 రాజధానులు' అనే నినాదమే కరెక్టని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అమరావతి ఎలాగో లెజిస్లేటీవ్ క్యాపిటల్‌గా కొనసాగుతుంది. పరిపాలనా రాజధాని విశాఖకు మార్చడం ద్వారా ఉత్తరాంధ్రకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఇక ఎప్పటి నుంచో రాయలసీమకు హైకోర్టు కేటాయించాలనే డిమాండ్ ఉంది. ఈ నినాదంతో అది కూడా తీరిపోతుంది. అలా మూడు ప్రాంతాల వారికీ న్యాయం చేస్తున్నామని వైసీపీ ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహం రచించింది. అదే సమయంలో టీడీపీ కేవలం అమరావతినే ఏకైక రాజధాని అని డిమాండ్ చేస్తోంది. ఇది తప్పకుండా మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీకి ఎదురు దెబ్బగా మారవచ్చు.

ఎన్నికలకు మరో 18 నెలల గడువు ఉంది. ఈ సమయంలో పరిపాలనా వికేంద్రీకరణపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్ జగన్ అనుకుంటున్నారు. ఇదే రాబోయే ఎన్నికల మెయిన్ అజెండాగా ప్రచారం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రాబోయే రోజుల్లో మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రాకుండా ఉండాలంటే.. ఇలా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఏకైక మార్గమని కూడా మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేశ్ ఇటీవల వ్యాఖ్యానించారు. మూడు రాజధానులే మా పాలసీ అని కూడా ప్రకటించారు. సుప్రీంలో పిటిషన్ వేయడం ద్వారా వైసీపీ ఈ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేసింది. మరి టీడీపీ ఈ నినాదాన్ని ఎలా ఎదుర్కుంటుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News