మందు టెట్, ఆ తర్వాతే డీఎస్సీ.. ప్రభుత్వం క్లారిటీ
గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుంది. గత నోటిఫికేషన్ రద్దు కావడంతో పాత అప్లికేషన్లు ఇప్పుడు చెల్లవు. కానీ వారు చెల్లించిన రుసుము మాత్రం వృథా కాదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మాటే కానీ, ఉద్యోగార్థుల్లో నిన్న మొన్నటి వరకు గందరగోళం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా, కొత్తది ఇస్తారా, మళ్లీ టెట్ నిర్వహిస్తారా, పాత పరీక్షతోనే సర్దుకోమంటారా..? కొత్తగా టెట్ పెడితే డీఎస్సీకి గ్యాప్ ఇస్తారా..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి అధికారులు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. వాటి ప్రకారం ఉద్యోగార్ధులెవరూ ఆందోళన చెందకుండా సాఫీగా ఈ ప్రక్రియ సాగిపోయే అవకాశాలున్నాయి.
గత ప్రభుత్వంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఆల్రడీ జరిగింది. దానికి సంబంధించిన ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది, అప్లికేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఆ తర్వాత కోడ్ అమలులోకి రావడంతో పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ అంటోంది. దీంతో కన్ఫ్యూజన్ మొదలైంది.
క్లారిటీ ఇచ్చేశారు..
గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుంది. గత నోటిఫికేషన్ రద్దు కావడంతో పాత అప్లికేషన్లు ఇప్పుడు చెల్లవు. కానీ వారు చెల్లించిన రుసుము మాత్రం వృథా కాదు. తిరిగి రుసుము చెల్లించకుండా వారు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలి. గతంలో అప్లికేషన్ పెట్టనివారికి కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక టెట్ విషయానికొస్తే గత ప్రభుత్వం నిర్వహించిన టెట్ ఫలితాలు ఈరోజు విడుదలవుతాయి. ఈ ప్రభుత్వం కూడా కొత్తగా టెట్ నోటిఫికేషన్ ఇస్తుంది. టెట్ తర్వాత 30రోజుల గ్యాప్ లో డీఎస్సీ కూడా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అంటే ఉద్యోగార్థులు మళ్లీ టెట్ రాసుకోవచ్చు, గ్యాప్ తీసుకుని డీఎస్సీకి కూడా ప్రిపేర్ కావొచ్చు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పుడు కసరత్తులు జరుగుతున్నాయి.