సంక్రాంతి నుంచి జనంలోకి టీడీపీ మౌత్ పబ్లిసిటీ బృందాలు

ఈ ప్రచారం కోసం టీడీపీ నేతలకు చెందిన విద్యాసంస్థల నుంచి కొందరు విద్యార్థులను కూడా ఎంపిక చేసి వారికి ఖమ్మంలో శిక్షణ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.

Advertisement
Update:2024-01-13 13:19 IST

ఎన్నికల సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టేందుకు, లేని హైప్ ఉన్నట్టు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించబోతోందని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం మౌత్ పబ్లిసిటీని టీడీపీ అస్త్రంగా వాడుకుంటోందని వైసీపీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలను, కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది వైసీపీ. టీడీపీ ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న దానిపై అప్రమత్తం చేస్తూ కొన్ని అంశాలను వెల్లడిస్తోంది.

వైసీపీ చెబుతున్న దాని ప్రకారం దాదాపు 5వేల మందిని టీడీపీ ఇలా మౌత్ పబ్లిసిటీ కోసం రంగంలోకి దింపింది. వీళ్లు సామాన్యుల్లా జనంలో కలిసిపోయి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రాజకీయాల గురించి చర్చ లేవనెత్తి.. ఎక్కడా చూసినా వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందంటూ మాట్లాడుతారు. పరస్పరం పరిచయం లేని వ్యక్తులుగా ఈ బృందంలోని సభ్యులే ముగ్గురు నలుగురు ఒక చోట చేరి వారిలో వారే ఇలాంటి చర్చ మొదలుపెడుతారు. ఒకరు చెప్పే అంశాలను మిగిలిన వారు సమర్థిస్తూ ఉంటారు.

ఇలా చేయడం ద్వారా టీ స్టాల్స్‌, సెలూన్లు, బస్టాండ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రచారం కోసం టీడీపీ నేతలకు చెందిన విద్యాసంస్థల నుంచి కొందరు విద్యార్థులను కూడా ఎంపిక చేసి వారికి ఖమ్మంలో శిక్షణ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.

తొలి విడతలో భాగంగా ఈ బృందాలను పట్టణ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, సూచనలు చేసేందుకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కో-ఆర్డినేటర్లను నియమించారు. త్వరలోనే ఈ బృందాలను గ్రామ స్థాయిలోకి పంపనున్నారు. అయితే గ్రామాల్లో కొత్త వారిని సులువుగా గుర్తు పట్టే అవకాశం ఉంటుందని కాబట్టి అక్కడ టీడీపీ కార్యకర్తల సాయం కూడా తీసుకోనున్నారు.

ఈ బృందంలోని వారు ఒక చోటికి వెళ్లడం, పరస్పరం పరిచయం లేనట్టుగా నటించడం, ఒకరు రాజకీయాలపై చర్చ మొదలుపెట్టడం, జగన్‌ ప్రభుత్వాన్ని తిట్టడం చేస్తారు. ఆ రెండో వ్యక్తి అవును మీరు చెబుతున్నది నిజం. నేను కూడా చాలా చోట్ల చూశా.. ప్రజలు ఇదే అనుకుంటున్నారని చెప్పడం చేస్తారు. తద్వారా అక్కడున్న మిగిలిన వారిలోనూ టీడీపీకి మంచి వాతావరణం ఉందన్న అభిప్రాయం కల్పించడం వీరి టార్గెట్.

సంక్రాంతి సంబరాలు ఎక్కువగా జరిగే జిల్లాలోనూ ఈ టీమ్‌లు దిగాయని వైసీపీ చెబుతోంది. కోడి పందాల జ‌రిగే చోట్ల‌కు వెళ్లి.. టీడీపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున పందాలు కడుతున్నారని.. వైసీపీపై ఎవరైనా పందెం కాస్తే లక్షకు రూ.10 లక్షలు టీడీపీ గెలుస్తుందనే వారు ఇస్తున్నారని ప్రచారం చేస్తారని వైసీపీ చెబుతోంది. నిజానికి అలా టీడీపీ గెలుస్తుందని పందాలు కాసేవారు ఉండరు. కానీ, సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారిలో టీడీపీ పట్ల సానుకూలత పెరిగింది అందుకే బెట్టింగ్ రాయుళ్లు కూడా టీడీపీపై భారీగా డబ్బులు కాస్తున్నారు కాబోలు అన్న అభిప్రాయం కలిగించడం ఈ బృందాల ఉద్దేశం. ఇలాంటి ప్రచారాలు ఎక్కడైనా నడుస్తుంటే అప్రమత్తంగా ఉండాలని కేడర్‌కు వైసీపీ సూచన చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News