టీడీపీ ప్రశ్నలు.. సోషల్ మీడియాలో దిమ్మతిరిగే సమాధానాలు

గుడ్డకాల్చి మొహాన వేసినట్టు ఈ ప్రశ్నల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది టీడీపీ బ్యాచ్. అయితే నెటిజన్లు మాత్రం వారికి కర్రుకాల్చి వాత పెట్టినట్టుగా సమాధానాలివ్వడం విశేషం.

Advertisement
Update:2024-03-19 22:43 IST

సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో హడావిడి చేయాలనుకుంటోంది టీడీపీ. వైసీపీకి పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కూటమికి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా అకౌంట్లలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటికి నెటిజన్లు కూడా అంతే ఘాటుగా బదులిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి..? వాటికి వస్తున్న సమాధానాలేంటి..? ఓసారి చూద్దాం.

1) ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది?

ఈ ప్రశ్న ముందు చంద్రబాబుని అడగాలి. ఐదేళ్లపాటు అమరావతిలో రెండు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, మిగిలిన చోట్ల మొండిగోడలు మిగిల్చి కార్పొరేట్ రాజధాని అంటూ కలరింగ్ ఇచ్చి, గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారు బాబు. మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో అడ్డగోలుగా అడ్డుకొని, ఆ తర్వాత కోర్టులో కేసులు వేసి తమాషా చూశారు. రాజధాని గురించి ప్రశ్నించే అర్హత టీడీపీకి ఎప్పటికీ లేదని సోషల్ మీడియాలో బదులిస్తున్నారు నెటిజన్లు.

2) కరెంట్ చార్జీలు భారీగా పెంచారు, ఎందుకు?

కరెంటు చార్జీల పెంపు గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకి లేదు. బషీర్ బాగ్ ఉదంతం గుర్తు లేదా..? ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో కరెంటు చార్జీలు ఎక్కువేం కాదు. సాధారణ పెంపుని కూడా కక్షసాధింపు అనడం చంద్రబాబుకే చెల్లింది.

3) ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు..?

ఆర్టీసీ చార్జీలది కూడా అదే పరిస్థితి. తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలో చార్జీలు ఎక్కువేం కాదు. ఇది కూడా కేవలం బురదజల్లే కార్యక్రమం.

4) పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

కేంద్రం చేతుల్లోని పోలవరాన్ని కేవలం కమీషన్లకోసం తీసుకున్న చంద్రబాబు తన హయాంలో పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు వైసీపీపై నిందలేయడం ఎంతవరకు సమంజసం. వరదలతో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ వ్యవహారంలో చంద్రబాబు ప్రధాన నిందితుడు. కరోనా టైమ్ లో కూడా పోలవరం పనులు చకచకా చేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.

5) మద్యపాన నిషేధం ఎక్కడ?

మద్యపాన నిషేధం చేశామని జగన్ ఎక్కడా చెప్పుకోవట్లేదు. అందుకే 99శాతం హామీలు మాత్రమే అమలు చేశామంటున్నారు. అయితే మద్యపాన నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. పోనీ చంద్రబాబు తన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అనే హామీ ఇవ్వగలరా..?

6) ప్రత్యేక హోదా ఎక్కడ?

ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. హోదా ఇవ్వలేము, ఇవ్వబోమన్నారు. కూటమిలో ఉన్న టీడీపీ ఈ ప్రశ్న వేయాల్సింది వైసీపీకి కాదు, బీజేపీకి. చంద్రబాబుకి దమ్ముంటే ముందు మోదీని నిలదీయాలి.

ఇక ఇసుక ధరలు పెరిగాయని, రోడ్లపై గుంతలు ఉన్నాయని, చెత్తపై పన్ను వేశారని, ఆస్తి పన్ను పెంచారని టీడీపీ రకరకాల ప్రశ్నలు సంధిస్తోంది. ధరల పెరుగుదల అనేది ప్రతి ఏడాదీ జరిగే వ్యవహారమే. కానీ జగన్ వచ్చాకే రేట్లు పెరిగాయని, పన్నులు పెరిగాయని టీడీపీ గగ్గోలు పెట్టడం ఇక్కడ విచిత్రం. టీడీపీ పాలనలో ఇసుక ఫ్రీ అన్నారు, ఆ తర్వాత రేటు కట్టారు, డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించి వెనక్కి తగ్గారు. ఇసుక పాలసీలో అనేక పిల్లిమొగ్గలు వేసింది గత టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక పాలసీలో అక్రమాలకు తావులేదని కచ్చితంగా చెప్పవచ్చు.

జాబ్ క్యాలెండర్ గురించి అడిగే అర్హత కూడా టీడీపీకి లేదు. సచివాలయ ఉద్యోగాలను పరిగణలోకి తీసుకోకపోతే ఎలా..? కరోనా వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యమైంది. మరి టీడీపీ హయాంలో చేసిందేంటి..? నాలుగున్నరేళ్లపాటు ఉద్యోగాలివ్వకుండా చివర్లో ఎన్నికల తాయిలంగా నిరుద్యోగ భృతి ఇచ్చారు..? ఆ మోసంతోనే వారు చిత్తుగా ఓడిపోయారు.

సీపీఎస్ రద్దు విషయంలో అనేక అవరోధాలుండటంతో మెరుగైన జీపీఎస్ ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం.

ఇలా పసలేని ప్రశ్నలెన్నిటినో అడిగింది టీడీపీ. వీటిలో చాలా వరకు అసత్యాలే ఉన్నాయి. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా ప్రజల్ని ఏమార్చే ప్రశ్నలు రూపొందించారు. గుడ్డకాల్చి మొహాన వేసినట్టు ఈ ప్రశ్నలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం వారికి కర్రుకాల్చి వాత పెట్టినట్టుగా సమాధానాలివ్వడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News