టీడీపీ 'పైశాచికం' పుస్తకం విడుదల..
పుస్తకావిష్కరణ కార్యక్రమం పేరుతో టీడీపీ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీస్ కేసులున్నాయి. ఆ కేసులపై విచారణ జరుగుతోంది. కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆయన దోషిగా తేలక ముందే ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎక్కడలేని హడావిడి చేస్తోంది. ఏకంగా 'పిన్నెల్లి పైశాచికం' అనే పేరుతో పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎల్లో మీడియా విపరీతమైన ప్రచారం కల్పిస్తోంది. అయితే ఇది 'టీడీపీ పైశాచికం' అంటూ సోషల్ మీడియా తిట్టిపోస్తోంది.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని అన్నారు టీడీపీ నేతలు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.. పిన్నెల్లిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో పల్నాడులో ఫ్యాక్షనిజం లేకుండా పోయిందని, మళ్లీ ఇప్పుడు వైసీపీ హయాంలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. చివరకు ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. పిన్నెల్లి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారని, ప్రజల్లో చైతన్యం వచ్చినందుకే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీడీపీ నేతలు.
పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టే వీడియో అసలు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందో ఈసీ చెప్పలేకపోవడం ఇక్కడ విశేషం. ఆ వీడియోని సాకుగా చూపిస్తూ టీడీపీ రెచ్చిపోవడం మరో విశేషం. అయితే అలాంటి ఘటనలు మాచర్లలో చాలా జరిగాయని, టీడీపీ చేసిన తప్పుల్ని ఎవరూ బయటకు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. పుస్తకావిష్కరణ కార్యక్రమం పేరుతో టీడీపీ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.