పొలం అమ్మి సర్పంచ్‌.. డ్రైవర్‌గా మారి అనుమానాస్పద మృతి

రాజకీయాల్లోకి దిగి భూమి పోయి, అప్పులు మిగిలాయని, ఇప్పుడు కుమారుడు కూడా లేకుండాపోయారని రామాంజినమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు గెలిచింది వైసీపీ తరపునే కాబట్టి సీఎం జగన్‌ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Advertisement
Update:2022-11-08 10:27 IST

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్ నాయుడు లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరపున సర్పంచ్‌గా పోటీ చేశారు. ఎన్నికల ఖర్చు కోసం ఐదు ఎకరాలు పొలాన్ని అమ్మేశారు. అప్పు కూడా చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాడు. కానీ అప్పులు తీర్చే మార్గం లేకుండాపోయింది. దాంతో తిరిగి ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా చేరారు.

ఇటీవల బండల లోడును తమిళనాడు తీసుకెళ్లాడు. అక్కడ వచ్చిన లక్షా 70 వేల రూపాయలను చంద్రశేఖర్ నాయుడు వాడేసుకున్నారు. దాంతో ఓనర్ డిష్‌రాజు ఏమైనా చేస్తాడన్న భయంతో హైదరాబాద్‌ పారిపోయారు చంద్రశేఖర్ నాయుడు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకున్న లారీ ఓనర్ మనుషులు రాజశేఖర్, మనోహర్ నాయుడు, యాసిన్‌లు వెళ్లి చంద్రశేఖర్‌ను తాడిపత్రి తీసుకొచ్చారు.

ఆ తర్వాత అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఏం జరిగిందన్న దానిపై పోలీసులు వర్సెస్‌ ఒకలా ఉంటే.. చంద్రశేఖర్ నాయుడి తల్లి మరోలా చెబుతున్నారు. డబ్బులు కాజేశాడన్న కోపంతో సర్పంచ్‌ చంద్రశేఖర్ నాయుడిని తీసుకొచ్చిన లారీ యజమానులు... ఒక బండల ఫ్యాక్టరీలో బంధించి చిత్రహింసలు పెట్టారని.. దాంతో మనస్థాపం చెందిన చంద్రశేఖర్ నాయుడు బండల ఫ్యాక్టరీ వద్దే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారని సీఐ చెబుతున్నారు. పోస్టుమార్టంలోనే ఇదే తేలిందని.. ఇప్పటికే చంద్రశేఖర్‌పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని సీఐ వివరించారు.

చంద్రశేఖర్ తల్లి రామాంజినమ్మ మాత్రం... పోలీసులే తన కుమారుడిని చంపించారని ఆరోపిస్తున్నారు. లారీకి సంబంధించిన లక్షా 70 వేలు తన కుమారుడు వాడుకున్నది నిజమేనని.. భయపడి హైదరాబాద్‌ వెళ్లిపోయాడని...ఆ మరుసటి రోజే లారీ యజమాని తన కుమారుడిని తీసుకొచ్చాడని ఆమె చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసులే తనకు ఫోన్ చేసి రూ.లక్షా 70 వేలు తీసుకొస్తేనే నీ కుమారుడిని విడుదల చేయడం వీలవుతుందని చెప్పారన్నారు. దాంతో తాను స్టేషన్‌కు వెళ్లగా చంద్రశేఖర్‌ను ఆస్పత్రికి తరలించామని చెప్పారన్నారు.

ఏం జరిగిందని తాను లారీ యజమాని మనుషులను ప్రశ్నించగా... అవమానంతో ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని చనిపోయాడని చెబుతున్నారని వివరించారు. తన కుమారుడి తల , కాళ్లు, చేతులపైనా తీవ్రమైన గాయాలున్నాయని.. పోలీసులు, లారీ యజమాని మనుషులు కలిసి చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆమె ఆరోపిస్తున్నారు. బండల ఫ్యాక్టరీ వద్ద చనిపోయి ఉంటే పోలీసులు ఫోన్ చేసి డబ్బులు తెస్తే విడుదల చేస్తామని ఎలా చెప్పారని రామాంజినమ్మ ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడి మరణం వెనుక ఎస్‌ఐ ధరణిబాబు హస్తముందని చెబుతున్నారు.

ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని.. అందుకే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె వాపోతున్నారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు రామాంజినమ్మ వెళ్లగా అనంతపురం ఎస్పీ ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. ఈ విషయం తమ దృష్టికి ముందే వచ్చిందని.. చంద్రశేఖర్‌ విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అయిందని ఎస్పీ తేల్చేశారు.

రాజకీయాల్లోకి దిగి భూమి పోయి, అప్పులు మిగిలాయని, ఇప్పుడు కుమారుడు కూడా లేకుండాపోయారని రామాంజినమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు గెలిచింది వైసీపీ తరపునే కాబట్టి సీఎం జగన్‌ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Tags:    
Advertisement

Similar News