ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది - సుప్రీం కోర్టు
నారాయణ దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు... కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది.
సుప్రీం కోర్టులో మాజీ మంత్రి నారాయణ ఊరట లభించింది. అమరావతి రింగ్ రోడ్డు కుంభకోణంలో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నారాయణ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. నారాయణ దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు... కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది.
రాజకీయ ప్రతీకారంలో కోర్టులను భాగస్వాములను చేయవద్దని జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ ఇచ్చిన న్యాయస్థానంలోనే పిటిషన్ వేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి చిన్నదానికి సుప్రీం కోర్టుకు రావడం అలవాటుగా మారిందంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.