వైసీపీ ఎంపీపై రాయితో దాడి..

తనపై జరిగిన రాయిదాడికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు ఆర్.కృష్ణయ్య. తనను చంపాలని టార్గెట్ చేశారని, ఇలాంటి దాడులకు తాను భయపడబోనని అన్నారు.

Advertisement
Update:2024-05-10 07:47 IST

సీఎం జగన్ పై రాయిదాడి ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్యపై రాయిదాడి సంచలనంగా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఎంపీ ఆర్.కృష్ణయ్య వాహనంపై నిల్చుని మాట్లాడుతుండగా.. వెనుక నుంచి రాయి వచ్చి వీపుపై బలంగా తాకింది. ఈ దాడిలో కృష్ణయ్యకు గాయమైంది. అయినా కూడా ఆయన తన ప్రసంగం కొనసాగించారు.


చంద్రబాబు పనే..!

తనపై జరిగిన రాయిదాడికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు ఆర్.కృష్ణయ్య. తనను చంపాలని టార్గెట్ చేశారని, ఇలాంటి దాడులకు తాను భయపడబోనని అన్నారు. బీసీలంతా వైసీపీవైపే ఉన్నారని చెప్పారు. బీసీలకు అవకాశాలిచ్చింది, వారి ఆత్మగౌరవం కాపాడింది టీడీపీయేనని చెప్పారు. బీసీలపై జరిగిన రాళ్లదాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు ఆర్.కృష్ణయ్య.

ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు..

రాయిదాడి ఘటన అనంతరం ఆర్.కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించినా, ఆ తర్వాత గాయం బాధ ఎక్కువ కావడంతో ఆయన వాహనం దిగి పక్కకు వచ్చారు. అనంతరం ఏర్పేడు పోలీస్ స్టేషన్లో రాయి దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో కృష్ణయ్యకు చికిత్స చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేశారు. ఆయన నీరసంగా ఉండటంతో వైద్యులు సెలైన్ ఎక్కించారు. బీసీలపై రాయి వేయించిన చంద్రబాబుకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కృష్ణయ్య. ఈ ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారాయన. 

Tags:    
Advertisement

Similar News