ఇంటి పేరు మార్చి, టెకీ కాదు-తాపీ కూలీ.. తపస్వి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు
ఇతడికి తపస్వి తన డబ్బులో ఒక బైక్‌ను, ఐ-వాచ్‌ను కొనిపెట్టింది. అతడి అవసరాల కోసం తన నగలను కూడా అమ్మాయి అమ్మేసింది. హత్య చేయడం కోసం విజయవాడలో రెండు సర్జికల్ బ్లేడ్‌లను కొనుగోలు చేసిన జ్ఞానేశ్వర్.. అమ్మాయి కొనిచ్చిన బైకుపైనే వచ్చాడు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో హత్యకు గురైన మెడికో విద్యార్థిని తపస్వి కేసులో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా నమ్మించి తపస్విని మోసం చేసిన జ్ఞానేశ్వర్ ఒక ఆకతాయి అని పోలీసులు తేల్చారు. తపస్విని మోసం చేయడానికి అనేక ఎత్తులు అతడు వేశాడు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్టాపురం గ్రామానికి చెందిన పిన్నమనేని మహేష్ కుమార్ కుమార్తె తపస్వి. మహేష్ కుమార్ మహారాష్ట్రలోని ఒక కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. తపస్వి తల్లి సీతారత్నం ముంబైలో చైతన్య కాలేజ్ డీన్‌గా పనిచేస్తున్నారు. తపస్వి గన్నవరంలోని ఒక కాలేజ్‌లో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.
రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. తపస్విని నమ్మించేందుకు జ్ఞానేశ్వర్ తన ఇంటి పేరును మార్చి తాను కూడా అగ్రకులానికి చెందిన వ్యక్తిగా నమ్మించాడు. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌నని నమ్మించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలకున్నారు. ఆగస్ట్ నుంచి కొద్ది కాలం పాటు ఇద్దరూ విజయవాడలో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని గడిపారు.
ఆ తర్వాత జ్ఞానేశ్వర్ అసలు మోసాలు బయటపడ్డాయి. తన కులం గురించి అబద్దం చెప్పానని వివరించాడు. తాను సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను కాదని చెప్పేశాడు. దాంతో ఆమె అతడికి దూరంగా ఉంటోంది. వేధింపులు ఆగకపోవడంతో పోలీస్ కేసు కూడా పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి మరోసారి అమ్మాయికి ఫోన్ చేయవద్దని జ్ఞానేశ్వర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా అతడు వేధింపులు ఆపకపోవడంతో ఆమె తన స్నేహితురాలి రూంకు వెళ్లిపోయింది.
ఇతడికి తపస్వి తన డబ్బులో ఒక బైక్‌ను, ఐ-వాచ్‌ను కొనిపెట్టింది. అతడి అవసరాల కోసం తన నగలను కూడా అమ్మాయి అమ్మేసింది. హత్య చేయడం కోసం విజయవాడలో రెండు సర్జికల్ బ్లేడ్‌లను కొనుగోలు చేసిన జ్ఞానేశ్వర్.. అమ్మాయి కొనిచ్చిన బైకుపైనే వచ్చాడు. చంపడానికి ముందు తనను పెళ్లి చేసుకుంటావా లేక చంపేయాలా అంటూ తొలుత తపస్వి పొట్టలోకి పొడిచాడు. చంపేయ్.. చావనైనా చస్తాను గానీ నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె అనడంతో గొంతు కోసేశాడు. ఈ విషయాన్ని అతడే పోలీసులకు చెప్పాడు.
ఇంజనీరింగ్ కోర్సులో సబ్జెక్టులు తప్పిన జ్ఞానేశ్వర్ ఆ తర్వాత పెయింటింగ్ పనులు చేసేవాడు. బెట్టింగులు, గంజాయి వంటి వాటికి అలవాటు పడ్డాడు. ఇతడు వీకెండ్స్‌లో విజయవాడ వీధుల్లో అమ్మాయి కొనిచ్చిన బైకుపై చక్కర్లు కొట్టేవాడని.. మద్యం మత్తులో పలువురితో గొడవలు కూడా పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పెయింటింగ్ పనులతో పాటు తాపీ పనులకూ వెళ్లాడు. తపస్విని మోసగించి ఆమె డబ్బుతో జల్సాలు చేశాడు. మోసం గుర్తించిన తపస్వి దూరం పెట్టడంతో ఉన్మాదిగా మారిపోయాడు.