జగన్ డబ్బులిచ్చారు కానీ.. యూనివర్శిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు

ఫీజుల వ్యవహారంలో పీటముడి పడటంతో ప్రభుత్వ విధానంపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల ఫీజుల్ని నేరుగా ఆయా విద్యాసంస్థలకు జమచేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు కదా అంటున్నారు కొంతమంది.

Advertisement
Update:2023-05-05 14:28 IST

గతంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అమలులో ఉన్నప్పుడు నేరుగా విద్యాసంస్థలకే విద్యార్థుల తరపున ప్రభుత్వం ఫీజులు చెల్లించేది. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపించి కొన్ని కాలేజీలు ప్రభుత్వాన్ని మోసం చేసేవనే ఆరోపణలున్నాయి. ఆ మోసాన్ని అరికట్టాలంటే పగడ్బందీగా విద్యార్థుల లెక్కలు తీస్తే సరిపోయేది. కానీ వైసీపీ హయాంలో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ కి విద్యా దీవెన, వసతి దీవెన అనే పేర్లు పెట్టి ఆర్థిక సాయాన్ని వారి తల్లిదండ్రుల అకౌంట్లలో వేస్తోంది ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడే విద్యాసంస్థలకు ఇబ్బంది వస్తోంది. కొంతమంది తల్లిదండ్రులు కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు డబ్బుల్ని సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇటు కాలేజీలకు ఫీజులు రావడంలేదు. అటు విద్యార్థులు ఇరుకున పడుతున్నారు. తాజాగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇలాంటి సమస్య ఎదురుకావడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి అధికారులు అడ్డుచెప్పారు. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రైవేటు యాజమాన్యాలు కఠినంగా ఉన్నాయనుకుంటే దానికో అర్థముంది, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నూజివీడు ట్రిపుల్ ఐటీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందనే వార్త బయటకు రావడంతో కలకలం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్జేయూకేటీలైన నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్‌ లలో ఫీజులు చెల్లించని 4వేల మంది బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికెట్లను నిలిపివేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినా ఫీజులు చెల్లించకపోవడంతో ఈ పనిచేశారు. దీంతో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ సాధించినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఫీజుల చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

చివరకు ఈ వ్యవహారం ప్రభుత్వ వరకు వెళ్లడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, కొంతమంది ఫీజు కట్టనివారు గడువు కోరారని, ఫీజుకట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్తామని చెప్పారని అంటున్నారు అధికారులు. క్యాంపస్ లో ఎలాంటి నిరసనలు జరగలేదని, విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.

ఫీజుల వ్యవహారంలో పీటముడి పడటంతో ప్రభుత్వ విధానంపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల ఫీజుల్ని నేరుగా ఆయా విద్యాసంస్థలకు జమచేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు కదా అంటున్నారు కొంతమంది. ఫీజుల్ని తల్లుల ఖాతాలో వేసి, ఆ తర్వాత వాటిని కాలేజీల్లో కట్టాలని చెబితే ఇలాంటి సమస్యలే వస్తాయంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News