పవన్ ది ఆటవిక మనస్తత్వం.. వర్మ ఘాటు ట్వీట్
ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అనుచరులకు ఇంత బ్రూటల్ వయొలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ప్రసంగాలు సంచలనంగా మారాయి. నడిరోడ్డులో బట్టలూడదీసి కొడతా, ఎమ్మెల్యేలను ఈడ్చుకెళ్తా, లాక్కెళ్తా.. అంటూ ఆయన చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. ఆ భాష ఏంటి అంటూ ముద్రగడ పద్మనాభం తొలి లేఖ రాశారు, పవన్ నుంచి సమాధానం లేకపోగా జనసైనికులు ఘాటుగా కౌంటర్లివ్వడంతో మలి లేఖలో పవన్ పై మరిన్ని విమర్శలు గుప్పించారు ముద్రగడ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ వేశారు. అసలు పవన్ నోటి వెంట అలాంటి వ్యాఖ్యలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారాయన.
అధికారంలోకొస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తా, లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఏ నాయకుడూ అని ఉండరన్నారు వర్మ. బహుశా హిట్లర్, సద్దాం, కిమ్ జొంగ్ ఉన్ తో సహా ఎవరూ ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వలేదన్నారు. మేము అధికారంలోకి వస్తే నరికేస్తాము అంటున్నారంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఆ పని చేయొచ్చని పరోక్షంగా చెప్పినట్టేనా అని ప్రశ్నించారు వర్మ.
ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అనుచరులకు ఇంత బ్రూటల్ వయొలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. హింసను ఎంకరేజ్ చేస్తూ మీటింగ్ లకు వచ్చే యువత భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారనేది పవన్ కల్యాణ్ కే తెలియాలని చురకలంటించారు.
అయితే రామ్ గోపాల్ వర్మ తటస్థులేమీ కారు. వ్యూహం అనే సినిమాతో వైసీపీకి మైలేజ్ పెంచడానికి ప్రయత్నిస్తూ జగన్ సానుభూతిపరుడనే ముద్ర ఆయనపై ఆల్రడీ పడింది. దీంతో జనసైనికులు వర్మకు ఘాటుగా కౌంటర్లిస్తున్నారు. నడిరోడ్లో చంద్రబాబుని ఉరి తీయాలంటూ గతంలో జగన్ చెప్పిన డైలాగుల్ని గుర్తు చేస్తున్నారు. అయినా వర్మ నోటి వెంట ఇలాంటి శాంతి వచనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయని సెటైర్లు పేలుస్తున్నారు.