కనకదుర్గ ఆలయంలో పవన్ శుద్ధి కార్యక్రమం
ప్రాయశ్చితదీక్షలో భాగంగా ఆలయంలో మెట్లను శుభ్రం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రాయశ్చితదీక్షలో భాగంగా పవన్ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్ దుర్గమ్మను దర్శించుకున్నారు.పవన్ అక్టోబర్ 1న తిరుమలకు వెళ్లనున్నారు. 2న తిరుమలలో ప్రాయశ్చితదీక్ష విరమించనున్నారు.తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నాపై విమర్శలు కాదు.. మీ బాధ్యత ఏమిటి?: పవన్
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏమిటి? లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతున్నది. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారు. అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. బాధ్యత తీసుకున్న వాళ్లనే నేను నిందిస్తున్నాను. దేశంలో సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తి మీద ద్వేషం ఉండదు. సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తాను అని పవన్ తెలిపారు. హైందవ ధర్మాన్ని కాపాడుతామని సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికీ బాధ్యత లేకుండా మాట్లాడుతుండటంపై పవన్ మండిపడ్డారు. సున్నిత అంశాలపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. తిరుమల లడ్డుపై ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనం దాటి పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విమర్శించే వైసీపీ నాయకులకు చెబుతున్నాను.. సనాతన ధర్మం జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. తప్పు జరిగితే ఒప్పుకోండి.. లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంగా చేశారు.