మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నలేనా?

ఒకేసారి ఇన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల్లో పాల్గొంటున్నందున జగన్ ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు కేంద్రం ఆమోదించినట్లే అని వైసీపీ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి.

Advertisement
Update:2022-10-28 15:10 IST

ప్ర‌ధాని నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖపట్నం పర్యటన ఫైనల్ అయిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. నిజానికి రాజధానుల అంశంతో తమకు ఎలాంటి సంబంధంలేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే న్యాయపరమైన సాంకేతిక కారణాల కారణంగానే బాగా జాప్యం జరుగుతోంది. అందుకనే క్యాంపు ఆఫీసును రెడీ చేసుకుని జగన్ వైజాగ్ షిఫ్టవుతారనే ప్రచారం పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలోనే మోడీ రెండు రోజుల పాటు వైజాగ్‌లో పర్యటించబోతున్నారు. నవంబర్ 11వ తేదీ రాత్రి వైజాగ్ వస్తున్న మోడీ అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భవనానికి శంకుస్ధాపన చేయబోతున్నారు. దీంతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గడచిన ఎనిమిదిన్నర ఏళ్ళల్లో మోడీ ఇప్పటికి మూడు సార్లు విశాఖకు వచ్చినా ఎప్పుడూ బస చేసింది లేదు.

ఒకేసారి ఇన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల్లో పాల్గొంటున్నందున జగన్ ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు కేంద్రం ఆమోదించినట్లే అని వైసీపీ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి. ఇదే సమయంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నట్లుగా సంకేతాలు అందాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత తొందరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ప్రకటన గ్యారెంటీ అని అనుకుంటున్నారు.

జగన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే రెండు రోజుల పాటు మోడీ వైజాగ్‌లో పర్యటించేవారు కాదనే వాదనను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. ఏదేమైనా మూడు రాజధానుల ఏర్పాటుపై ఒక‌ప్పుడు బీజేపీ నేతల్లో కనిపించిన వ్యతిరేకత ఇపుడు కనబడటం లేదు. ఢిల్లీలోని అగ్రనేతల నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే స్ధానిక కమలనాధులు తమ గొంతును తగ్గించేస్తున్నారని అనిపిస్తోంది. జ్యుడీషియరీలోని సాంకేతిక సమస్యలు కూడా పరిష్కారమైపోతే ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ స్పీడుగా చర్యలు తీసుకుంటారనటంలో సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News