నో పోలీస్, నో కేస్.. ఇదంతా అధికార మదం -పేర్ని నాని
వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని, కేసు పెట్టాలని వచ్చినా కూడా ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆరోపించారు పేర్ని నాని.
అధికార మదం తలకెక్కి ఇష్టమొచ్చినట్టు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ మద్దతుదారులనే ఒకే ఒక్క కారణంగా నిరుపేద కుటుంబాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేస్తున్నారని, వారిపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. కనీసం పోలీసులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు నాని.
నో పోలీస్, నో కేస్..
వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని, కేసు పెట్టాలని వచ్చినా కూడా ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆరోపించారు పేర్ని నాని. చంద్రబాబు డైరక్షన్ లోనే ఇలా జరుగుతోందని చెప్పారు. డీజీపీ సహా పోలీస్ అధికారులందరికీ ముందే ఆదేశాలందాయని, అందుకే వారు వైసీపీపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకున్నారని అన్నారు. కనీసం కేసు నమోదు చేయడానికి కూడా వెనకాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు.
ఓట్ల లెక్కింపు జరిగిన రోజునుంచీ వైసీపీపై దాడులు జరుగుతున్నాయని అన్నారు పేర్ని నాని. టీడీపీ, జనసేన రౌడీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఇకనైనా వీటికి స్వస్తి పలకాలన్నారు. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోడానికి నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, దాడులకు తెగబడటం దుష్ట సంప్రదాయం అని హెచ్చరించారు నాని.