హద్దు దాటొద్దు.. జనసేన నేతలకు పవన్‌ వార్నింగ్

పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో హెచ్చరించారు.

Advertisement
Update: 2024-07-08 03:15 GMT

జనసేన నేతలు, కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు ఆ పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు జనసేన కాన్ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్ హెడ్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ ఓ లేఖను విడుదల చేశారు.

లేఖలో ఏముందంటే?

అభివృద్ధి క్షీణదశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా పగ్గాలు చేపట్టిన NDA ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు పవన్‌. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో హెచ్చరించారు.

ఇక ప్రోటోకాల్‌ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులుగాని, కార్యకర్తలు గాని పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందన్నారు పవన్‌. అటువంటివారిపైనా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం రాకపోతే కఠినమైన చర్యలు తప్పవన్నారు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని లేఖలో కోరారు.

ఇటీవల పలువురు కూటమి నేతలు ప్రోటోకాల్ ఉల్లంఘించిన విషయం తెలిసిందే. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సతీమణి పోలీసులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇక పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలోనూ జనసేన, టీడీపీ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News