నేను చెప్పేది వింటే జగన్ చెవుల్లో రక్తమే..
హైదరాబాద్ లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తనకు చాలా తెలుసన్నారు పవన్. అయితే అవేంటనేది మాత్రం ఆయన చెప్పలేదు.
భీమవరం సభలో పవన్ కల్యాణ్ మునుపటికంటే మరింత ఆవేశంగా మాట్లాడారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తనకు చాలా తెలుసన్నారు పవన్. అయితే అవేంటనేది మాత్రం ఆయన చెప్పలేదు. జగన్, ఆయన మంత్రి వర్గ చిట్టా మొత్తం తాను విప్పగలనని, తాను చెప్పేది వింటే జగన్ చెవుల్లో నుంచి రక్తం కారుతుందని అన్నారు. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. వైసీపీ నేతల నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని సెటైర్లు పేల్చారు పవన్.
రాష్ట్ర పంట గంజాయి, రాష్ట్ర ఆయుధం గొడ్డలి
చిన్న వయసులోనే తాత ప్రోద్బలంతో ఎస్‌ఐ ప్రకాశ్ బాబుని స్టేషన్ లో పెట్టి కొట్టిన ఘనత జగన్ ది అని అన్నారు పవన్ కల్యాణ్. పోలీసు వ్యవస్థపై జగన్ కి గౌరవం లేదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించారని చెప్పారు. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చారని ఎద్దేవా చేశారు. నిండా మునిగినోడికి చలేంటని, ఉభయగోదావరిజిల్లాల్లో వైసీపీతో సై అంటే సై అని సవాల్ విసిరారు.
మౌన పోరాటం..
సీఎం జగన్ పర్యటన అంటే, ఆ ఊరిలో చెట్లు కొట్టేస్తున్నారని, వైసీపీ పాలనలో చెట్లు కూడా మౌనపోరాటం చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు పవన్. వైసీపీ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలపై దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు.
అపూర్వ ఆదరణ..
భీమవరంలో ఓడిపోయినా తాను పట్టించుకోలేదని, ఓటమి, గెలుపు అనేవి తనకు లేవని, తనది కేవలం ప్రయాణం మాత్రమేనని అన్నారు పవన్. సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే లాభం ఉండదని, కులాల పరిధి దాటి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పాతికేళ్ల పాటు ప్రజల కోసం కూలీగా పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటాలన్నారు. భీమవరంలో జనసేన సభకు వచ్చిన ప్రజాదరణే మార్పుకి నిదర్శనం అని చెప్పారు జనసేనాని.