సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్ ని తరిమేస్తాయి..
కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది సిద్ధంగా ఉండండి అంటూ ఇటీవల సీఎం జగన్ పిలుపునివ్వగా, దానికి కౌంటర్ ఇచ్చారు పవన్. జరగబోయేది కురుక్షేత్రమేనని, కానీ తాము పాండవులం అని అన్నారు.
వైనాట్ 175 కాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు వస్తే చాలా గొప్ప అంటూ ఎద్దేవా చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. అవనిగడ్డ సభతో వారాహి నాలుగో విడత యాత్రను ప్రారంభించిన ఆయన ఊహించినట్టుగానే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా.. టీడీపీ-జనసేన కూటమిని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సైకిల్, గ్లాస్ కలసి ఈసారి ఫ్యాన్ ని తరిమేస్తాయన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి ఖాయమని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పారు.
అదే మా లక్ష్యం..
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అన్నారు పవన్ కల్యాణ్. జగన్ చెప్పే అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఆయన అద్భుతమైన పాలకుడైతే తాను రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదన్నారు. పదేళ్లలో జనసేన అనేక దెబ్బలు తిన్నా కూడా.. ఆశయాలు, విలువల కోసం పార్టీని నడుపుతున్నానని చెప్పారు పవన్. యువత భవిష్యత్తు బాగుండాలని తానెప్పుడూ అనుకుంటానని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నానని అన్నారు.
జరిగేది కురుక్షేత్రమే, కానీ మేమే పాండవులం..
కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది సిద్ధంగా ఉండండి అంటూ ఇటీవల సీఎం జగన్ పిలుపునివ్వగా, దానికి కౌంటర్ ఇచ్చారు పవన్. జరగబోయేది కురుక్షేత్రమేనని, కానీ తాము పాండవులం అని అన్నారు. వైసీపీ కౌరవ సేన అంటూ కౌంటర్ ఇచ్చారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యేపై కూడా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జగన్ ను దేవుడని ప్రజలు మొక్కితే.. ఆయన దెయ్యమై ప్రజలను పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి.. జనసేన-టీడీపీ వ్యాక్సినే సరైన మందు అన్నారు. ఏపీలో జగన్ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్ లా ఉందని చెప్పారు పవన్.