అబ్బెబ్బే.. నావి కులరాజకీయాలు కావు, కుల సర్దుబాట్లు
పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలని, రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలన్నారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలన్నారు పవన్.
వారాహి వాహనంపై ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ ప్రతి చోటా, ప్రతి సభలోనూ కులాల ప్రస్తావన తెచ్చారు. కులాల వారీగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులాల కూడికలు, తీసివేతల గురించి గొప్పగా చెప్పారు. ఓ దశలో మతం గురించి కూడా ఆయన మాట్లాడారు. బీజేపీతో ఉన్నందుకు తనకు ముస్లింలు దూరం కావొచ్చన్నారు. అయితే అదంతా కుల, మత రాజకీయం కాదని అంటున్నారు పవన్. కేవలం కుల సర్దుబాటు కోసమే తాను కులాల ప్రస్తావన తెచ్చానన్నారు. కుల, మతాలను రెచ్చగొట్టేందుకు కాదన్నారు. తాను కుల రాజకీయాలు చేయనని, అందుకే విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకుంటున్నట్టు వివరించారు పవన్.
రాజోలులో జనసేన నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ మరోసారి సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని అన్నారు. పులివెందుల సంస్కృతిని వైసీపీ నేతలు అన్ని చోట్లకు తెచ్చారని మండిపడ్డారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని చెప్పారు. ఓటమి తర్వాత కూడా జనసేన నిలదొక్కుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు దీపం.. ఈరోజు కడప రాజంపేట దాకా వెలుగునిస్తోందని అన్నారు పవన్.
రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతానని, ఎదురుతిరుగుతానని అన్నారు. 200 రూపాయలు లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందికానీ, 2వేల కోట్లు దోచుకున్న నేతలకు మాత్రం శిక్షలు పడవని, వారు పరిపాలన చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలని, రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలన్నారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలన్నారు పవన్.