ముద్రగడ 40 లక్షలకు అమ్ముడుపోతారా..? - జనసేన కొత్త ఆరోపణ

కొనుగోలుకు డబ్బును వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే కానుకగా ఇచ్చారంటూ ఆరోపించింది. ఇప్పటికే బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పూజలు నిర్వహించి మూడు రాత్రుల నిద్ర పూర్తి చేసింది నిజం కాదా అని జనసేన ప్రశ్నిస్తోంది.

Advertisement
Update:2023-06-24 10:58 IST

ముద్రగడ ప‌ద్మ‌నాభం రూపంలో జనసేనకు పెద్ద సవాల్‌ ఎదురవుతోంది. ముద్రగడ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనసేన కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ముద్రగడపై కొత్త ఆరోపణతో జనసేన అధికారికంగా దాడి మొదలుపెట్టింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ముద్రగడ పద్మనాభం లబ్ది పొందారంటూ ఆరోపణలు చేస్తోంది. తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి దగ్గరలోనే వీఆర్‌ అపార్ట్‌మెంట్స్‌ ఏ బ్లాక్‌లో రూ.75 లక్షల విలువైన త్రిబుల్‌ బెడ్‌రూం ఇంటిని కేవలం రూ.40 లక్షలకు కొనుగోలు చేశారని జనసేన తన లేఖలో ఆరోపించింది.

దాని కొనుగోలుకు డబ్బును వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే కానుకగా ఇచ్చారంటూ ఆరోపించింది. ఇప్పటికే బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పూజలు నిర్వహించి మూడు రాత్రుల నిద్ర పూర్తి చేసింది నిజం కాదా అని జనసేన ప్రశ్నిస్తోంది.

తుని రైలు దగ్ధం ఘటన తమరికి ముందే తెలుసు కదండీ..? కానీ అమాయకులైన కాపు యువతను ప్రలోభ పెట్టి రెచ్చగొట్టి వారి జీవితాలను బలి చేశారు కదండీ అంటూ విమర్శలు చేసింది. పిఠాపురంలో పోటీ చేసేందుకు వైసీపీతో ఒప్పందం చేసుకున్నారని.. కానీ, అక్కడ పవన్‌ కల్యాణ్‌కు వచ్చిన స్పందన చూసి ఓటమి ఖాయమైందన్న అక్కసుతోనే ముద్రగడ ఆరోపణలు చేస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది.

వంగవీటి మోహన్ రంగా పేరుని అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగింది ముద్రగడేనని విమర్శించింది. 2019 నుంచి కాపు రిజర్వేషన్ ఉద్యమానికి శాశ్వత ముగింపు ఎందుకిచ్చారంటూ జనసేన ప్రశ్నించింది. తమరు కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసింది కాపుల అభివృద్ధి సంక్షేమం కోసం కాదని కేవలం వైఎస్సార్సీపీని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తెచ్చేందుకు, రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే అంటూ ఆరోపించింది. జనసేన చేసిన ఈ ఆరోపణలకు ముద్రగడ మరో లేఖ విడుదల చేసే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News