Taraka Ratna Health Update: తారకరత్న పరిస్థితి అత్యంత విషమం.. బెంగళూరుకి బాలయ్య
Taraka Ratna Health Update: సడన్ గా బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా బెంగళూరు పయనమయ్యే సరికి నందమూరి అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది.
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. అయితే సడన్ గా బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా బెంగళూరు పయనమయ్యే సరికి నందమూరి అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. వైద్యులు ఏం చెప్పారు, పండగ రోజు కుటుంబ సభ్యులు హడావిడిగా ఎందుకు బెంగళూరు బయలుదేరి వెళ్లారు, అసలు తారకరత్న కండిషన్ ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. విదేశీ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు హాజరైన తారకరత్న ఉన్నట్టుండి యాత్రలోనే కుప్పకూలారు, అక్కడినుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు, ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఆయనను తరలించారు కుటుంబ సభ్యులు.
23రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నా కోలుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఆయన పరిస్థితి మెరుగైందని కుటుంబ సభ్యులు చెబుతున్నా, వైద్యులు అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్స్ లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా కుటుంబ సభ్యులంతా బెంగళూరు వెళ్లే సరికి మరోసారి కలకలం రేగింది.
ఆదివారం తారకరత్నను హైదరాబాద్ కి తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నా దానిలో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించి వచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధికారికంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు లేదా రేపు ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.