'మోచా' ముంచుకొస్తోంది జాగ్రత్త.. 2023లో ఇదే తొలి తుపాను

సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను, పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ వైపు పయనిస్తుంది. అయితే ఈ తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు.

Advertisement
Update:2023-05-04 17:30 IST

ఈ ఏడాది తొలి తుపాను ముంచుకొస్తోంది. దీనికి మోచా అనే పేరు పెట్టారు. ఈ మోచా తుపాను తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోందనే అంచనాలున్నాయి. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల 7న ఇది అల్పపీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడుతుంది. వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. 8, 9 తేదీల నుంచి తుపాను ప్రభావం పూర్తి స్థాయిలో మొదలవుతుంది.

ఏయే రాష్ట్రాలపై ప్రభావం..

సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను, పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ వైపు పయనిస్తుంది. అయితే ఈ తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశాపై కూడా ఈ తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మోచా తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

మూలిగే నక్కపై..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వాలు ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో కాస్త భరోసా లభించింది. ఈ దశలో మళ్లీ తుపాను అంటే మిగతా ప్రాంతాల రైతులు వణికిపోతున్నారు. అందులోనూ తుపాను రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News