మైలవరం టీడీపీలో వసంత చిచ్చు.. భగ్గుమంటున్న ఉమా
మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ను పోటీ చేయిస్తారని, ఆ కారణంగా దేవినేని ఉమాను పెనమలూరు నియోజకవర్గానికి పంపిస్తారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ టికెట్ లభించని నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడానికి సిద్ధపడ్డారు. దీంతో మైలవరం టీడీపీలో చిచ్చు మొదలైంది. వసంతకు మైలవరం నియోజకవర్గ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భగ్గుమంటున్నారు.
మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ను పోటీ చేయిస్తారని, ఆ కారణంగా దేవినేని ఉమాను పెనమలూరు నియోజకవర్గానికి పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. దాంతో వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని ఆయన అంటున్నారు. మైలవరం నుంచి పోటీ చేయడానికే దేవినేని మొగ్గు చూపుతున్నారు.
దేవనేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ ఇంతకు ముందు రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో వారిద్దరు చెరో పార్టీ నుంచి పోటీ పడ్డారు. వైఎస్ జగన్ గాలిలో వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కోసం తాను మైలవరం నియోజకవర్గాన్ని వదిలేసి పెనమలూరుకు వెళ్లడానికి దేవినేని ఉమా ఏ మాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సిందే.