వైసీపీని విడిచిపెడితే ఆత్మహత్య చేసుకున్నట్టే -రోజా
వైసీపీ నాయకులెవరూ జగన్ మాట జవదాటరని, ఒకవేళ పదవులే పరమావధిగా ఉన్నవాళ్లు పార్టీలు మారితే వారికి భవిష్యత్ ఉండదని శాపనార్థాలు పెట్టారు రోజా.
ఏపీ రాజకీయాల్లో గోడదూకుళ్లు మొదలవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత జోరుగా సాగుతాయనే ప్రచారం కూడా ఉంది. అధికార వైసీపీకి దూరం జరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దశలో మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని విడిచిపెడితే సూసైడ్ చేసుకున్నట్టేనని తేల్చి చెప్పారు. జగన్ కి దూరంగా జరగడం అంటే ఆత్మహత్య చేసుకోవడమేనని అన్నారామె.
రోజా పరిస్థితి ఏంటి..?
మంత్రి రోజాకు ఈసారి నగరి నియోజకవర్గంలో సీటు లేదనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అయితే అలాంటిదేమీ లేదని నగరిలో తానే పోటీ చేస్తానని చాలా సార్లు స్పష్టం చేశారు రోజా. జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. వైసీపీ నాయకులెవరూ జగన్ మాట జవదాటరని, ఒకవేళ పదవులే పరమావధిగా ఉన్నవాళ్లు పార్టీలు మారితే వారికి భవిష్యత్ ఉండదని శాపనార్థాలు పెట్టారు రోజా.
చంద్రబాబుతో ఫుట్ బాల్..
చంద్రబాబుకి ఏపీలోని 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు ఆయన కుప్పం నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాలని హితవు పలికారు. అందుకే ఆయన కుప్పంకు పదే పదే పర్యటనలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో చంద్రబాబుతో కుప్పం ప్రజలు ఫుట్ బాల్ ఆడతారని సెటైర్లు పేల్చారు రోజా.