బీహార్ లో చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా..?

బీహార్‌ లో చెల్లని కాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ డీల్‌ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.

Advertisement
Update:2024-03-04 11:33 IST

ఏపీలో గెలుపు ఓటములపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మాటలతో టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి, వైసీపీ నుంచి మాత్రం ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. అసలు జగన్ ఓటమిని డిసైడ్ చేయడానికి పీకే ఎవరని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తనను తాను రాజకీయ మహా మాంత్రికుడిని అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జీరోగా మారారని అన్నారు. సొంత రాష్ట్రం బీహార్ లో రాజకీయ బిచ్చగాడుగా మారిన ఆయన, ఏపీ గురించి జోస్యం చెప్పడమేంటని నిలదీశారు. బీహార్ లో చెల్లని రూపాయి, ఏపీలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు.

పీకే వెనక చంద్రబాబు..

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీకే ఘన విజయం అని సామాన్యులు సైతం చెబుతున్నారని, మరి పీకేకి జగన్ ఓటమి గురించి ఎవరు చెప్పారని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబుతో కలసి ఆ చెల్లని రూపాయి కొత్త పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. ఆ కుటిల యత్నాలను తిప్పికొట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో అసలు సర్వే టీమ్ లేని ప్రశాంత్‌ కిషోర్‌ డీబీటీ(నగదు బదిలీ)కి ప్రజలు ఓట్లు వేయబోరని ఎలా తీర్మానిస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ఐదేళ్లుగా ఎలా పురోగమిస్తాయని నిలదీశారు మంత్రి గుడివాడ.

బీహార్‌ లో చెల్లని కాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ డీల్‌ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. ఆ డీల్‌లో భాగంగానే ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పీకే పలుమార్లు రహస్యంగా భేటి అవుతున్నారని, రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నారని చెప్పారు. డీబీటీ, అభివృద్ధి.. రెండూ చేయలేని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఒక పీకే(పవన్ కల్యాణ్) వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకే(ప్రశాంత్ కిషోర్)ని కూడా తెచ్చుకున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి అమర్నాథ్. 

Tags:    
Advertisement

Similar News