అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా- మేకతోటి సుచరిత
ఆ తర్వాత ఆమెను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ పదవి నుంచి తాను తప్పుకుంటానని సుచరిత మీడియా ముందు ప్రకటించారు.
మాజీ మంత్రి మేకతోటి సుచరిత జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. మంత్రి పదవి పోయిన సమయంలో ఆమె అలకబూనారు. ఆ సమయంలో తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని కూడా సుచరిత కుమార్తె ప్రకటించారు. ఆ తర్వాత జగన్‌మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఆ తర్వాత ఆమెను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ పదవి నుంచి తాను తప్పుకుంటానని సుచరిత మీడియా ముందు ప్రకటించారు. కేవలం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ అనివార్య కారణంతోనే జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని.. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వాన్ని కలిసి వివరిస్తానన్నారు. అంతకు మించి కారణాలేవీ లేవన్నారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఇది వరకే అరెస్ట్ చేయాల్సిందిన్నారు. గతంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు సుచరితపైనా, ఐపీఎస్‌లపైనా అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడే అయ్యన్నను అరెస్ట్ చేయాల్సిందని ఇప్పటికే బాగా ఆలస్యమైందన్నారు సుచరిత. పవన్ కల్యాణ్ యాత్రలు చేసుకోవచ్చు గానీ.. ప్రభుత్వాన్ని కూల్చడానికే తన యాత్ర అని చెప్పుకోవడం మాత్రం అతడి అజ్ఞానానికి నిదర్శనమన్నారు.