చంద్రబాబూ.. నువ్వెవరికి టికెట్లిచ్చావ్.. వారి జాతకాలు ఇవీ..
టీడీపీ తొలి విడత జాబితాలో సీట్లు ఇచ్చినవారి జాతకాలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు ద్వంద్వవైఖరి బయపడుతుంది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోరు విప్పితే చాలు, తాను మచ్చ లేని నాయకుడినని, నిప్పునని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తనవాళ్లంతా సొక్కమేనని డబ్బాలు కొడుతుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటారు. వైసీపీలో ఉన్నవారంతా రౌడీలని ఆరోపిస్తుంటారు. ఈనాడు అధినేత రామోజీరావు ఆయనకు వంత పాడుతుంటారు. అయితే, టీడీపీ తొలి విడత జాబితాలో సీట్లు ఇచ్చినవారి జాతకాలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు ద్వంద్వవైఖరి బయపడుతుంది. ఉదాహరణకు కొద్ది మందిని తీసుకుందాం.
టీడీపీ తొలి జాబితాలో టికెట్లు దక్కించుకున్నవారిలో ఒకరు హిందూ ఆలయాలపై బురద చల్లిన వ్యక్తి ఉన్నాడు. మరొకరు టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో రౌడీయిజం చేసిన వ్యక్తి. ఇంకొకతను గతంలో హత్య కేసులో ఉన్న వ్యక్తి. హిందూ దేవతను, హిందూ ఆచారాలను దూషిస్తూ వీడియోలు చేసిన మహాసేన రాజేశ్‌కు చంద్రబాబు పి. గన్నవరం టికెట్ ఇచ్చారు. ఆయనకు టికెట్ ఇచ్చిన మరుక్షణం నుంచి ఆయన గతంలో హిందూ దేవతను, హిందూ ఆచారాలను దూషిస్తూ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మహాసేన రాజేశ్ చంద్రబాబును గతంలో విమర్శించినవాడే. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి ఆయన వైసీపీని, వైఎస్ జగన్‌ను తిట్టడం ప్రారంభించాడు. దానికి చంద్రబాబు ఫిదా అయిపోయినట్లున్నారు. జనసేనను కూడా ఆయనగారు గతంలో తిట్టిపోశారు. మహాసేన రాజేశ్‌కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు మాత్రమే కాకుండా జనసేన నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
కొలికలపూడి శ్రీనివాస్ అనే నాయకుడికి తిరువూరు అసెంబ్లీ టికెట్ దక్కింది. ఆయన అమరావతి రాజధాని జెఎసీ పేరుతో హడావిడి చేస్తుంటారు. గత ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబును తీవ్రమైన పదజాలంతో దూషించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించారు. తిరువూరుతో ఆయనకు సంబంధం కూడా లేదు.
కొలికలపూడి గతంలో ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పక్కన కూర్చున్న బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరాడు. ఆయన చరిత్ర ఇదీ.. ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. విశాఖ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకతను వంగవీటి హత్య కేసులో నిందితుడు. ఇలా చెప్పుకుంటే ఈ జాబితాలో చంద్రబాబు కూడా చేరుతారు. ఆయన తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు.