కండువా పడకముందే స్వరం పెంచిన కన్నా.. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

ఏపీలో బీహార్ కంటే దారుణ మైన ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి పక్ష పార్టీల కార్యాలయాలు ను టార్గెట్ చేసే రాక్షస పాలన ఎందుకని ప్రశ్నించారాయన.

Advertisement
Update:2023-02-21 14:13 IST

టీడీపీ కండువా ఇంకా మెడలో పడలేదు, అప్పుడే కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై స్వరం పెంచారు, సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు, టీడీపీకి మద్దతుగా మీడియా ముందుకొచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి ఘటనపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జైలులో ఉండి చేసింది ఇదేనా..?

రక్తం రుచి మరిగిన పులిలా వైసీపీ పాలన ఉందని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ జైలులో ఉండి బాగా తర్ఫీదు పొందాడా అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో బీహార్ కంటే దారుణ మైన ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి పక్ష పార్టీల కార్యాలయాలు ను టార్గెట్ చేసే రాక్షస పాలన ఎందుకని ప్రశ్నించారాయన.

నవరత్నాలు కాపాడతాయా..?

సంక్షేమ పాలనే తమ విజయానికి నాంది అంటూ వైసీపీ ఎప్పుడూ చెబుతుంటుందని, నవ రత్నాలపై అంత నమ్మకం ఉంటే ఇలా దాడులు చేయడం దేనికంటూ మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో రాజకీయ దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఈ స్థాయి లో పోలీసు వ్యవస్థ దిగజారడం తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు కన్నా. జగన్ రాక్షస పాలన ఆపాలని, ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

పొత్తుపై చెప్పలేను..

బీజేపీ మంచి సిద్దాంతాలు కలిగిన పార్టీ అని, కానీ రాష్ట్రం లో నాయకత్వం సరిగా లేదని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలా వద్దా అనేది ఇరు పార్టీల అధిష్టానాలు చర్చించుకుని తీసుకోవాల్సిన నిర్ణయం అని అన్నారు. దానిపై తాను క్లారిటీ ఇవ్వలేనన్నారు.

ఈనెల 23న చేరిక..

ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో చేరేందుకు ఈనెల 23న మహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆరోజు గుంటూరులోని కన్నా వారి తోట నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. అధికారికంగా టీడీపీలో చేరకముందే, కన్నా ఈ స్థాయిలో జగన్ పై మాటల తూటాలు పేల్చారంటే, టీడీపీలో చేరాక ఆయన మాటలు మరింత పదునెక్కే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News