ప‌వ‌న్‌కి మ‌ళ్లీ ఆత్మ‌గౌర‌వం గుర్తొచ్చింది

తనను తిట్టించినా, తనపై దుష్ప్రచారం చేసినా, చివరకు తన తల్లిని తిట్టించినవాళ్ళతో చేతులు కలపటం కూడా ఆత్మగౌరవంతోనే అని అనుకోవాలేమో.

Advertisement
Update:2023-10-02 10:08 IST

కృష్ణా జిల్లా వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గురించి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయాలని అనుకున్నా చివరి నిమిషంలో ఆగిపోయారట. ఎందుకంటే తనకు ఆత్మగౌరవం ఉండటం వల్లే ప్రధానికి ఫిర్యాదు చేయలేదట. ప్రభుత్వం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటానికి, ఆత్మగౌరవానికి ఏం సంబంధమో అర్థంకావటంలేదు. జనసేన నిజమైన ప్రతిపక్షమే అయితే జగన్ పాలనలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే కేంద్రానికి ఫిర్యాదు చేయటంలో తప్పులేదు.

అయితే ఎందుకు చేయలేదంటే ఆత్మగౌరవం ఉందని చెబుతున్నారు కానీ అది నిజంకాదని అందరికీ తెలుసు. ఇక్కడ విషయం ఏమిటంటే మోడీ అపాయిట్మెంట్ తీసుకోవటం పవన్ వల్ల కావటంలేదు. గడచిన నాలుగున్నరేళ్ళుగా పవన్ ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా మోడీ లేదా అమిత్ షా ఇవ్వటంలేదు. వీళ్ళ అపాయిట్మెంట్ కోసం పవన్ ఎన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు కాసి తిరిగివచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక అసలు విషయానికొస్తే ఒకప్పుడు చంద్రబాబును ఇదే పవన్ తిట్టిన తిట్టుకుండా చాలాసార్లే తిట్టారు. తన తల్లిని లోకేష్ తిట్టించాడని చెప్పి బహిరంగసభల్లో వార్నింగులిచ్చారు. తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని గుంటూరు సభలో ఎన్ని ఆరోపణలు చేశారో. తెలుగుదేశం పార్టీని ఓడించ‌క‌పోతే తన పార్టీ జనసేనే కాదని చాలెంజ్‌లు చేశారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబును హత్తుకున్నారు. ఇదంతా ఆత్మగౌరవంతోనే చేస్తున్నారా? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారనే తాను చంద్రబాబుతో విభేదించినట్లు చెప్పటం కూడా అబద్ధమే.

ఇక ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీని కూడా పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పాచిపోయిన లడ్డూలు మొహాన కొట్టారంటు ఎన్నో నిష్టూరాలాడారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపిచ్చారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురవ్వగానే వెంటనే బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు? అంతకుముందు తాను మోడీని బీజేపీని అన్న మాటలన్నింటినీ మరచిపోయి పొత్తు పెట్టుకున్నది ఆత్మగౌరవం ఉండేనా? తనకు పరిటాల రవి గుండు కొట్టించాడని టీడీపీ ఆఫీసులో వాళ్ళే వార్తలు రాయించి ప్రచారం చేస్తున్నట్లు మండిపోయిన ఇదే పవన్ ఇప్పుడు చంద్రబాబుతో ఎందుకు చేతులు కలిపినట్లు? తనను తిట్టించినా, తనపై దుష్ప్రచారం చేసినా, చివరకు తన తల్లిని తిట్టించినవాళ్ళతో చేతులు కలపటం కూడా ఆత్మగౌరవంతోనే అని అనుకోవాలేమో.

Tags:    
Advertisement

Similar News