విదేశీ విద్యా దీవెన.. ఆ తేడా చూడాలంటున్న జగన్
దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని, ఇంత పెద్ద మొత్తంలో విదేశీ చదువులకు ఆర్థిక సాయాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడంలేదని, ఇది మనకు గర్వకారణం అన్నారు సీఎం జగన్.
గత టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్యా దీవెన కింద కేవలం 10లక్షల రూపాయలు ఇచ్చేవారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్టంగా కోటీ పాతిక లక్షల రూపాయలు విదేశీ విద్యా దీవెన ఆర్థిక సాయం అందుతోందని చెప్పారు సీఎం జగన్. ఏపీనుంచి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తున్న సాయాన్ని ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. గతంలో ఎంతమందికి ఎంత మొత్తం ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ కోరుకున్న చదువుకి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు జగన్.
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులని మొత్తం 21 విభాగాల్లో చదువుకుంటున్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లభించిందని చెప్పారు. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద రూ.65.48 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. గత ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు బకాయి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు జగన్.
విదేశీ విద్యా దీవెన కింద అర్హుల ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు, రికమండేషన్లకు తావు లేదన్నారు సీఎం జగన్. కేవలం వారి పేదరికాన్ని చూసి విదేశీ విద్యా దీవెనకు అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఆయా కాలేజీల్లో ప్రవేశం పొందిన ఎవరైనా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని, ఇంత పెద్ద మొత్తంలో విదేశీ చదువులకు ఆర్థిక సాయాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడంలేదని, ఇది మనకు గర్వకారణం అన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా విద్యార్థులు బాగా చదవాలని ఆకాంక్షించారు సీఎం జగన్.