విలువలు విశ్వసనీయత ఉండాలి, లేకపోతే ఇంట్లో కూడా గౌరవించరు

చంద్రబాబు స్థానంలో తాను ఉండి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలబెట్టి ఉండేవాడిని కాదన్నారు జగన్. మెజార్టీ మనదని తెలిసినా కూడా వారు అభ్యర్థిని నిలబెడుతున్నారని, అధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు.

Advertisement
Update:2024-08-07 15:23 IST

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని, అవి లేకపోతే కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా గౌరవించరని, ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ తరపున విశాఖ జిల్లాలో గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపులు జరుగుతాయనే అనుమానంతో విలువలు, విశ్వసనీయతను వారికి మరోసారి గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినప్పుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నామని.. ఇప్పుడు ప్రతి అడుగులోనూ ఎంతోమంది తనతో ఉన్నారని చెప్పుకొచ్చారు జగన్.


2014లో ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇవ్వాలని చాలామంది తనతో చెప్పారని, కానీ తాను అందుకు అంగీకరించలేదన్నారు జగన్. అందుకే ఆ ఎన్నికల్లో ఓడిపోయామని, ఆ తర్వాత చంద్రబాబు పాలన అధర్మంగా సాగిందని, మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోయారని ఫలితంగా 2019లో తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేశామని, అయితే 2024లో చంద్రబాబు తిరిగి తప్పుడు హామీలిచ్చారని, కొంతమంది ప్రజుల ఆ హామీలను నమ్మి మోసపోయారని... అందుకే ఆయన గెలిచారన్నారు. అధర్మ యుద్ధంతో గెలిచిన చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ.. రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారని మండిపడ్డారు. జగనే ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి డబ్బులు పడేవని, రైతు భరోసా, మత్స్యకార భరోసా ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు జగన్.

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ గుర్తుపై గెలిచిన నేతల్ని అధర్మంగా కొనేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని అన్నారు జగన్. ఫోన్లు చేసి 5 లక్షలిస్తా, 10లక్షలిస్తా పార్టీ మారతారా అని అడుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్థానంలో తాను ఉండి ఉంటే.. తాను పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి నిలబెట్టి ఉండేవాడిని కాదన్నారు. మెజార్టీ మనదని తెలిసినా కూడా వారు అభ్యర్థిని నిలబెడుతున్నారని, అధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు జగన్.  

Tags:    
Advertisement

Similar News