ఎమ్మెల్యేలు ఒంటరిగా మిగిలిపోతారా?

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం కొందరు నెల్లూరు కార్పొరేటర్లు కోటంరెడ్డికి జై కొట్టారు. మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు అనుకున్న వాళ్ళెవరూ ఎమ్మెల్యేల‌కి జై కొట్టలేదు. తన తాజా వ్యూహంతో ఎమ్మెల్యేలను ఒంటరి చేయాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది.

Advertisement
Update:2023-03-27 11:04 IST

సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టినట్లు సమాచారం. చాలాకాలం క్రితమే నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్ధానంలో బాధ్యతలను ఇతరుల‌కు అప్పగించారు. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఇన్‌చార్జితోనే నడిపిస్తున్నారు. తాజాగా ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల‌ను నియమించబోతున్నారు. ఉదయగిరిలో ఇన్‌చార్జిని నియమించినప్పటికీ అది వివాదాస్పదమైంది. అందుకనే తొందరలో వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి ఇక్కడ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను మళ్ళీ పార్టీలోకి తీసుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకనే నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ ఎమ్మెల్యేలతో వెళ్ళకుండా జగన్ ప్లాన్ చేస్తున్నారట. తొందరలోనే అన్నీ మండలాల్లోని బలమైన నేతలతో సమావేశం అవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళినా వాళ్ళతో ఎవరు వెళ్ళకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఖాళీగా ఉన్న పదవుల్లో కొన్నింటిని ద్వితీయశ్రేణి నేతలకు ఇవ్వబోతున్నారట.

అలాగే పార్టీలో భర్తీ చేయాల్సిన పదవులను కూడా బలమైన సెకండ్ కేడర్ నేతలతో వెంటనే ఫిలప్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే సెకండ్ కేడర్ నేతల అవసరం చాలావుందని జగన్ ఇప్పటికే గుర్తించారు. వివిధ నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయశ్రేణి నేతల్లో కొందరితో ఇప్పటికే సమావేశమయ్యారు కూడా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నేతలతో తొందరలోనే భేటీ కాబోతున్నారట.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం కొందరు నెల్లూరు కార్పొరేటర్లు కోటంరెడ్డికి జై కొట్టారు. మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు అనుకున్న వాళ్ళెవరూ ఎమ్మెల్యేల‌కి జై కొట్టలేదు. తన తాజా వ్యూహంతో ఎమ్మెల్యేలను ఒంటరి చేయాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది. ఈరోజు ఆ నలుగురు పార్టీలోనే ఉన్నా తొందరలోనే బయటకు వెళ్ళిపోవటం ఖాయం. అప్పుడు వాళ్ళతో ఎవరూ వెళ్ళకుండా జగన్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News