వంగవీటి రంగా వారసుడు రాధా.. జనసేన వైపు చూస్తున్నారా..?
ఒక పర్యాయం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీల్లోనూ పనిచేశారు.
వంగవీటి రంగా.. ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కాపు సామాజికవర్గంలోనే కాదు బడుగు బలహీనవర్గాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయన క్రేజ్ చనిపోయిన 30 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రంగా తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారుడు రాధాకృష్ణ తండ్రి అంత కాకపోయినా ఎక్కడికెళ్లినా పది మందిలో గుర్తింపు పొందుతూనే ఉన్నారు.
ఒక పర్యాయం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీల్లోనూ పనిచేశారు. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన జనసేన వైపు వెళ్తారని, సొంత సామాజికవర్గం నుంచి ఆ దిశగా ఒత్తిడి వస్తోందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.
పెళ్లి సంబంధంతో మరింత ప్రచారం
కాగా.. రాధా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ జక్కం అమ్మాణి, బాబ్జిల కుమార్తె పుష్పవల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుదేశం నుంచి మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిచిన అమ్మాణి ఇప్పుడు జనసేనలో ఉన్నారు. తాజాగా వారాహి యాత్రలో నరసాపురానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అమ్మాణి వాళ్లింట్లోనే బస చేశారు. అప్పుడు రాధా కాబోయే భార్య పుష్పవల్లి కూడా పవన్‌తో మాట్లాడుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. పవన్‌కు సన్నిహితంగా ఉన్న కుటుంబంలోకి అల్లుడిగా వెళ్తున్న రాధా కూడా జనసేనలోకి వెళ్లడానికి ఇది మరిన్ని సంకేతాలు ఇస్తోందని విశ్లేషిస్తున్నారు. రాధా మాత్రం ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్.